పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణకు ఓకే
ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయం
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /జూలై 12:
వీఆర్‌ఏలను వారి విద్యార్హతలను బట్టి ఇరిగేషన్ సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి వారి సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ మంగళవారం సాయంత్రం సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో వీఆర్‌ఏల సర్దుబాటుతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. వీఆర్‌ఏలతో చర్చించి వారి అభిప్రాయాలు సేకరించాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మంత్రు లు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్‌తో కూడిన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఇది వీఆర్‌ఏలతో బుధవారం నుంచి చర్చలు ప్రారంభించనుంది. దాని సూచనల ప్రకారం నిర్ణయం తీసుకుని వీఆర్‌ఏల సేవల్ని వినియోగించుకోవాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. ప్రొబెషనరీ కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శులు నిర్దేశిత లక్ష్యాల్ని మూడింట రెండొంతులు సాధిస్తే క్రమబద్ధీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. వారిని పనితీరు జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలించనుంది. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర అభినందనీయమని, ఇతర రాష్ట్రాలతో పోటీపడి తెలంగాణ పల్లెలు సాధించిన జాతీయ అవార్డుల్లో వారి కృషి ఉందని సీఎం అభినందించారు. బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో నిర్మాణం పూర్తయిన నల్లపోచమ్మ ఆలయం, మసీదు, చర్చిని ఒకే రోజు ఆగస్టు 25న ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. ఆయా మత పెద్దల్ని సంప్రదించి తేదీ ఖరారు చేశారు. కాగా, ‘చీఫ్ మినిస్టర్స్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆంత్రప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్ స్కీం’లో లబ్ధి పొందిన ఎస్టీ యువత సాధించిన విజయాలపై గిరిజన సంక్షేమ శాఖ ప్రచురించిన పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు.