తెలంగాణ ఉద్యమ నాయకుడు, బీఆర్‌ఎస్ నేత చికిత్సపొందుతూ మృతి.. కంటతడి పెట్టిన మంత్రి జగదీష్ రెడ్డి..
హ్యూమన్ రైట్స్ టుడే/సూర్యాపేట /జులై, 09:
తెలంగాణ ఉద్యమ నాయకుడు, బీఆర్‌ఎస్ నేత కృష్ణారెడ్డి మృతి పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్‌ఎస్ నాయకులు సంతాపం తెలిపారు. జిల్లాలోని ఆత్మకూరు మండలం బొప్పారం గ్రామానికి చెందిన ఉద్యమకారుడు పగడాల కృష్ణారెడ్డి రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
తలకు బలమైన గాయం కావడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, నల్గొండ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు, రాష్ట్ర గీతా కార్మిక సహకార ఆర్థిక సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, తదితరులు ఆదివారం కృష్ణారెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
కృష్ణారెడ్డి పార్ధివ దేహాన్ని చూసి మంత్రి కంటతడి పెట్టుకున్నారు. మంత్రి మాట్లాడుతూ సహచర ఉద్యమకారుడు పగడాల కృష్ణారెడ్డి అకాల మరణం పార్టీకి, కుటుంబ సభ్యులకు తీరని లోటని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.