*ఎన్నికల వేళ ఉద్యోగుల పిఆర్సి*
*ఉద్యోగుల్లో వ్యతిరేకత చల్లార్చేందుకు సర్కారు అడుగులు*
*తొలుత ఐఆర్, ఎన్నికల ముందు ఫిట్మెంట్?*
*ఉద్యోగులకు ఒక డీఏ ప్రకటించిన సర్కారు*
*ఎన్నికల ముందు మచ్చిక చేసుకునేలా పావులు*
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జూన్ 21: అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులను మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందా!? వారిలోని వ్యతిరేకతను తగ్గించేందుకు వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)ను నియమించనుందా!? ముందుగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించి.. పీఆర్సీ నివేదిక ఇవ్వగానే ఎన్నికల ముందు ఫిట్మెంట్ను ప్రకటించనుందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఈ మేరకు ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖకు ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంవో నుంచి సంకేతాలు అందినట్లు తెలిసింది. పీఆర్సీ కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను పరిశీలించాలని చెప్పినట్లు సమాచారం. దాంతో, ఉద్యోగుల సర్వీసులు, వారి వేతనాలపై సంపూర్ణ అవగాహన కలిగిన రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారుల కోసం సాధారణ పరిపాలన శాఖ జీఏడీ వేట ప్రారంభించింది. ఇది కొలిక్కి రాగానే.. సీఎంకు ప్రతిపాదనలు పంపుతుంది. ఆయన ఆమోదంతో పీఆర్సీని ఏర్పాటు చేస్తారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని పీఆర్సీని ప్రభుత్వం కోరే అవకాశమున్నట్లు తెలిసింది. నిజానికి, పీఆర్సీ పని నామమాత్రమే. అది సిఫారసు చేసిన ఫిట్మెంట్ను సీఎం ప్రకటించబోరు. తన స్వీయ నిర్ణయంతో ఫిట్మెంట్ను ప్రకటిస్తూ రావడం గత రెండు సందర్భాల్లో జరిగింది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత అప్పటి వరకు పెండింగ్లో ఉన్న 2013 పీఆర్సీకి సంబంధించిన ఫిట్మెంట్ను సీఎం భారీగా 43 శాతం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, రాష్ట్రంలో మొదటి పీఆర్సీని 2018 మే 18న ఏర్పాటు చేశారు. అది కాస్తా 7.5 శాతం ఫిట్మెంట్ను సిఫారసు చేస్తే.. కేసీఆర్ 30 శాతం ఫిట్మెంట్ను ప్రకటించారు. ఇప్పుడు కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా సీఎం కేసీఆర్ భారీగానే ఫిట్మెంట్ను ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. అప్పటిలోగా మధ్యంతర భృతి (ఐఆర్)ని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి.
*వ్యతిరేకతను తగ్గించుకునేందుకే…!*
ప్రభుత్వ తీరుపై కొంత కాలంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకూ మూడు డీఏలను పెండింగ్లో పెట్టిందని, ఎట్టకేలకు సోమవారం ఒక డీఏను విడుదల చేసినా, ఇంకా రెండు పెండింగ్లోనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఒక శాతమో రెండు శాతమో వాటా చెల్లిస్తామని పదే పదే చెబుతున్నా ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక, సప్లిమెంటరీ బిల్లులను క్లియర్ చేయడం లేదని, మెడికల్ రీ-యింబర్స్మెంట్ బిల్లుల గురించి పట్టించుకోవడం లేదన్న ఆగ్రహంతో ఉన్నారు. పదోన్నతులు, బదిలీలను అటకెక్కించిందని, ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని, కొత్త జిల్లాలకు కేడర్ స్ట్రెంథ్ను నిర్ధారించడం లేదని విమర్శిస్తున్నారు. అసంతృప్తులు, నిరసనల మధ్యనే ఇటీవల జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో అధికార బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థిని టీచర్లు ఓడించారు. ప్రభుత్వంపై ఉన్న తమ వ్యతిరేకతను చాటారు. ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాలు దూరమవుతున్న అంశం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ఎన్నికల ముందు వారిని మరింత దూరం చేసుకోవడం మంచిది కాదని భావిస్తోంది. ఎలాగైనా ఆ వర్గాలను మచ్చిక చేసుకుని, ఎన్నికల్లో గట్టెక్కాలని యోచిస్తోంది.