*ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కూడా!*
*రేపు ప్రెస్మీట్లో ప్రకటించనున్న నేతలు*
*అమిత్‌షా ఖమ్మం టూర్‌కు ఒకరోజు ముందే..*
*బీజేపీకి నిరాశ.. కాంగ్రెస్ పార్టీలో జోష్*
*ఖమ్మం అసెంబ్లీ బరిలోకి పొంగులేటి?*
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జూన్ 13:
బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారైంది. వీరికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కూడా జత కలవనున్నారు. వీరు ముగ్గురూ కలిసి బుధవారమే హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి కాంగ్రెస్‌లో తమ చేరిక విషయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా బీఆర్‌ఎ్‌సను వీడాల్సివచ్చిన పరిస్థితులు, తాము ఎదుర్కొన్న ఇబ్బందులతోపాటు తమ భవిష్యత్తుపై నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తారని తెలిసింది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఖమ్మం జిల్లా పర్యటనకు సరిగ్గా ఒకరోజు ముందే కాంగ్రె్‌సలో చేరికకు సంబంధించి వీరు ప్రకటన చేయనుండడం గమనార్హం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాకే చెందిన నేత కావడం, ఖమ్మంలో అమిత్‌షా సభకు ముందురోజే తన నిర్ణయాన్ని వెల్లడించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలు నియోజకవర్గాల నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పొంగులేటితోపాటు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పొంగులేటి.. కాంగ్రెస్ తరఫున ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా కాలంగా బీఆర్ఎస్ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఒకదశలో అధిష్ఠానం ఆయనతో మాట్లాడినా.. పార్టీలో ఉండేందుకు ఇష్టపడలేదని సమాచారం. దీంతో సీఎం కేసీఆర్ ఒక సందర్భంలో, ‘‘పొంగులేటి పోతాడు.. వదిలేయండి’’ అని అంతర్గత సమావేశంలో వ్యాఖ్యానించారు. అయితే పొంగులేటి ఒంటరిగా కాకుండా.. జిల్లాలోని తన అనుచర గణాన్ని వెంట తీసుకొని మరీ పార్టీని వీడుతుండడమే కీలకంగా మారింది. ఈ మేరకు ఆయన గత కొన్నినెలలుగా నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆ సమావేశాల్లో తన భవిష్యత్తు రాజకీయ వ్యూహంపై కూడా చర్చించారు. తొలుత బీజేపీలో చేరాలని పొంగులేటి భావించినా.. ఇందుకు ఆయన అనుచరుల నుంచి పూర్తి మద్దతు రాలేదు. దీంతో ఆయన పలు దఫాలుగా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ నేతలతో సమావేశమై చర్చలు జరిపారు. బీజేపీ చే రికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్‌తో, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డితో కూడా ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. కానీ, ఆ పార్టీ నుంచి తగిన భరోసా రాలేదన్నది సమాచారం. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో అయితేనే బాగుంటుందనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది.
*ఒకరు ఇద్దరై.. ఆ తర్వాత ముగ్గురై*
బీఆర్ఎస్ అధిష్ఠానం పట్ల అసంతృప్తిని తొలుత పొంగులేటి ఒక్కరే ప్రకటించగా.. నెల రోజుల క్రితం ఆయనకు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తోడయ్యారు. జూపల్లి కలిశాక తాము ఎటువైపు వెళ్లాలన్నదానిపై ఇద్దరి మధ్య అంతర్గత సమావేశాలు జరిగాయి. అదే సమయంలో ఇద్దరూ కలిసి పలువురు నేతలతో రహస్యంగా సమావేశాలు నిర్వహించారు. వారం రోజుల క్రితం వీరికి బీఆర్‌ఎ్‌సకే చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి జత కలిశారు. దీంతో ముగ్గురూ కలిసి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవితో చర్చలు జరిపారు. ఈ 14న సంయుక్తంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారని తెలుస్తోంది. అయితే ఈ ముగ్గ్గురు నేతలు కాంగ్రె్‌సలోకి వెళ్లడమనేది అధికార బీఆర్‌ఎ్‌సకే కాకుండా బీజేపీకి కూడా నిరాశ కలిగిస్తోందని అంటున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ పరిణామం భవిష్యత్తులో తమకు బూస్ట్‌గా ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి సోమవారం సీఎం కేసీఆర్ గద్వాల జోగుళాంబ జిల్లాలో జరిపిన పర్యటనలో పాల్గొని ఆశ్చర్యపరిచారు. కేసీఆర్ వెంట పర్యటన ఆసాంతం ఉండడంతోపాటు గద్వాలలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలోనూ పాల్గొన్నారు. సభావేదికపై బీఆర్ఎస్ నేతలతో కలిసి కూర్చున్నారు. దీంతో ఆయన నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.