హ్యూమన్ రైట్స్ టుడే/గద్వాల /జూన్ 11:
సీఎం కేసీఆర్ సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా లో పర్యటించనున్నారు. నూతన జిల్లాలుగా ఏర్పడిన తర్వాత ప్రతీ జిల్లాలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, జిల్లా పోలీసు కార్యాలయం నిర్మాణాలు చేపట్టగా ఇటీవల ఆ నిర్మాణాలు పూర్తయ్యాయి. అలాగే బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం కూడా చాలా రోజుల క్రితమే నిర్మాణం పూర్తైంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సోమవారం వాటిని ప్రారంభించనున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇప్పటికే సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను బీఆర్‌ఎస్ శ్రేణులు పూర్తిచేశాయి. 2018 తర్వాత మళ్లీ ఇక్కడ అధికారిక కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. 2018 జూన్ నెలలోనే గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించగా, దాదాపు ఐదేళ్ల తర్వాత గద్వాల జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననుండటంతో హామీలపై ప్రజాప్రతినిధులు, అధికారులు ఆశలు పెట్టుకున్నారు. గద్వాలకు మెడికల్ కాలేజీ, చేనేత పార్కు, పలు సాగునీటి పథకాలకు సంబంధించి నిధుల విడుదలపై ప్రత్యేకంగా హామీలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.