హ్యూమన్ రైట్స్ టుడే/మిర్యాలగూడ /జూన్10:
పట్టణంలోని 24వ వార్డు కౌన్సిలర్ కుందూరు నాగలక్ష్మి శుక్రవారం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. డీఎస్పీ వెంకట గిరి తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు వాసవినగర్ కాలనీ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్, శివాని పాఠశాల ప్రిన్సిపల్ కుందూరు నాగలక్ష్మి(40) శుక్రవారం సాయంత్రం తన నివాసంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. స్థానికులిచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలం పరిశీలించి ఆత్మహత్యకు గల కారణాలను విచారిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగా రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మరెడ్డిలు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. నాగలక్ష్మికి భర్త శ్యాంసుందర్ రెడ్డి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సింహారావు పేర్కొన్నారు. అమెరికాలో ఉన్న ఆమె సోదరుడు ఆదివారం వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.