*కవిత చెపితే కరెక్టే..
*కొత్తవారికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కేసీఆర్
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /జూన్ 10:
తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వచ్చే దిశగా వ్యూహరచన చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకోసం కొత్త పథకాలను తీసుకురావడంతో పాటు విపక్షాలను ఏ రకంగా కట్టడి చేయాలనే దానిపై ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను పక్కనపెట్టి వారి స్థానంలో కొత్తవారికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ముందుగానే సగానికి పైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి మిగతా స్థానాలను పెండింగ్‌లో పెట్టాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని ప్రస్తుతం ఆ దిశగా ఆయన కసరత్తు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కొందరికి ఈసారి టికెట్ రాదనే విషయంలో ఇప్పటికే క్లారిటీ వచ్చిందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
మిగతా వారి సంగతి ఎలా ఉన్నా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలకు మాత్రం మరోసారి ఎమ్మెల్యే టికెట్ గ్యారంటీ అనే చర్చ జరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణంగా కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కొద్ది రోజుల నుంచి నిజామాబాద్ ప్లారమెంట్ నియోజకవర్గ పరిధిలోని స్థానాల్లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొంటున్నారు. ఈ సమావేశాల్లో కవిత చేస్తున్న ప్రకటనలు పలువురు ఎమ్మెల్యేల్లో ఉత్సాహం నింపుతున్నాయి. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో జరిగిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న కవిత అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మళ్లీ గెలిపించాలని ప్రజలను, కార్యకర్తలను కోరారు.
దీంతో ఆయన స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్లకు ఎలాంటి డోకా లేదనే విషయంలో బీఆర్ఎస్ వర్గాలకు దాదాపుగా ఓ క్లారిటీ వచ్చిందని నిజామాబాద్ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఓ వైపు కేసీఆర్ పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో కవిత ఈ రకంగా ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎవరెవరికి మళ్లీ టికెట్లు ఇస్తారనే విషయంలో ఎమ్మెల్సీ కవితకు స్పష్టమైన సమాచారం ఉంటుంది కాబట్టే ఆమె ఈ రకంగా ప్రకటన చేస్తున్నారని కాబట్టి ఆమె మళ్లీ గెలిపించాలని కోరిన వారందరికీ టికెట్లు దాదాపుగా గ్యారంటీ అని పలువురు లెక్కలు వేసుకుంటున్నారు.