దివ్యాంగులకు కెసిఆర్ తీపి కబురు
హ్యూమన్ రైట్స్ టుడే/మంచిర్యాల /జూన్ 09:
రూ. 3116 పింఛను అందుకుంటున్న దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు చెప్పారు. ఆసరా పెన్షన్ల కింద నెలానెలా వారు అందుకుంటున్న మొత్తాన్ని పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. పెంచిన పెన్షన్లు వచ్చే నెల నుంచే అమల్లోకి వస్తాయని కేసీఆర్ స్పష్టం చేశారు. మంచిర్యాలలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించిన అనంతరం ప్రగతి నివేదన సభ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.
మొత్తం తెలంగాణ సమాజం బాగుండాలని, అందుకు కులం, మతం తేడా లేకుండా అందరికీ సంక్షేమాన్ని అందిస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. ముసలమ్మలు, ముసలి తాతలు ఆసరా పెన్షన్లతో బ్రహ్మాండంగా ఉన్నారని అన్నారు. ప్రస్తుతం వికలాంగులకు రూ.3,116 పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న ఈ సందర్భంలో, ఈ రోజు మంచి రోజు కాబట్టి వికలాంగుల పెన్షన్ కూడా పెంచబోతున్నామని కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం రూ.3,116 పింఛను వస్తుండగా, మరో వెయ్యి రూపాయలు పెంచి రూ.4,116 ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. మంచిర్యాల గడ్డ పై ఉండి తెలంగాణ ఈశాన్య ప్రాంతం నుంచి ప్రకటించాలని తాను ఇన్ని రోజులు ఈ విషయాన్ని సస్పెన్షన్‌లో పెట్టానని అన్నారు. దీంతో ఇకపై దివ్యాంగులకు రూ.4,116 పెన్షన్ అందనుంది.