హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/జూన్ 08:
చేయని తప్పుకు నిందలు పడటంతో ఆ బాలిక భరించలేకపోయింది. నువ్వే చేశావ్.. నువ్వే చేశావ్ అంటూ పదే పదే అనడంతో ఆ బాలిక తీవ్ర మనస్థాపానికి గురైంది. చివరకు ఆ బాలిక తీసుకున్న నిర్ణయం అందరినీ కలిచివేసింది. నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం శివతాండలో గురువారం విషాదం చోటు చేసుకుంది. దొంగతనం నింద భరించలేక వందన అనే బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఫోన్ పౌచ్‌లోని రూ.600 దొంగిలించిందని వందనపై పక్కింటి వ్యక్తులు దొంగతనం నెపం మోపారు. తాను తీయలేదని ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు. దీంతో సదరు బాలిక వారి నిందలను భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. తల్లితో ఫోన్ మాట్లాడేందుకు వందన తన పక్కింటి వ్యక్తి ఫోన్‌ను తీసుకుంది. ఫోన్ మాట్లాడిన తరువాత తిరిగి ఫోన్ ఇచ్చేసింది. అయితే ఫోన్ పౌచ్‌లో రూ.600 ఉన్నాయని.. వాటిని నందన దొంగలించిందని ప్రవీణ్‌తో పాటు అతని తల్లి బులిభాయ్ ఆరోపించారు. చేయని తప్పుకు నిందవేశారని బాలిక మనస్తాపానికి గురైంది. చివరకు వారి మాటలు భరించలేక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలిక ఆత్మహత్యకు ప్రేరేపించిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్యాయంగా బాలిక మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.