అక్రమ వ్యాపారులపై ప్రత్యేక నిఘా

Get real time updates directly on you device, subscribe now.

నకిలీల పై నజర్

హ్యూమన్ రైట్స్ టుడే/కొత్తగూడెం/ మే 22:
దేశానికి రైతే వెన్నెముక. రైతన్నల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నది. రైతుల జోలికొస్తే కన్నెర్ర చేస్తున్నది. అన్నదాతల అవసరాలను ఆసరాగా చేసుకొని మోసం చేయాలని చూసే అక్రమ వ్యాపారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. వానకాలం సీజన్‌ సమీపిస్తుండడంతో నకిలీల భరతం పట్టేందుకు టాస్క్‌ఫోర్స్‌ను సోమవారం రంగంలోకి దింపింది. మేలైన విత్తనాలు, ఎరువులనే విక్రయించేలా చర్యలు చేపట్టింది. ఈ విషయాలపై డీలర్లు, రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నది. నాణ్యమైన విత్తనాలను అందించేందుకు ఈ ఏడాది నూతన విధానాన్ని అమలు చేస్తున్నది. ఎరువులు, విత్తనాల స్టాక్‌ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. ఏదేమైనా కర్షకులకు నష్టం కలిగించే వారెవరైనా జైలుపాలుకాక తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నకిలీ విత్తనాల విక్రయాలకు రాష్ట్ర సర్కారు అడ్డుకట్ట వేస్తున్నది. రైతులు వ్యాపారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దింపింది. పోలీస్‌ అధికారులు, వ్యవసాయాధికారులతో కూడిన బృందం ఇప్పటికే జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నది. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏరాటు చేసి ప్రత్యేక ఫోన్‌నంబర్‌ను అందుబాటులో ఉంచారు.


విత్తనాలకు పెరిగిన డిమాండ్‌
వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విత్తనాలకు డిమాండ్‌ పెరిగింది. దీంతో వివిధ కంపెనీల పేర్లతో నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి కొత్త స్టిక్కర్లతో వచ్చేస్తున్నాయి. అధిక లాభాలకు ఆశపడి పలుచోట్ల డీలర్లు గుట్టుచప్పుడు కాకుండా వాటిని రైతులకు విక్రయిస్తున్నారు. దీంతో పంట సాగు చేసిన అన్నదాతలు ఆశించిన మేరకు దిగుబడి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. వానకాలం సీజన్‌ నుంచి విత్తన డీలర్లు ఏయే ఎరువులు విక్రయిస్తున్నారు.? స్టాక్‌ ఎంత ఉంది.? ఎవరికి విక్రయించారు.? రశీదు నంబర్‌? లాంటివి ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియపై డీలర్లకు శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం వారి పనితీరును పర్యవేక్షించేందుకు టాస్క్‌ఫోర్స్‌ టీంను కూడా సిద్ధం చేసింది. ఇప్పటినుంచి అన్నదాతలను మోసం చేసే వారు ఎవరైనాసరే ఊరుకునేది లేదని ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment