తిరుమలలో మరోసారి మద్యం కలకలం
హ్యూమన్ రైట్స్ టుడే/తిరుపతి /మే 21:
తిరుమల కొండపై మరోసారి మద్యం కలకలం రేపింది. శ్రీవారి ఆలయానికి కూతవేటు దూరంలో ఉన్న హెచ్‌టి కాంప్లెక్స్ లోని షాప్ నెం.78లో 5 మద్యం బాటిల్స్‌ను టీటీడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షాపును సీజ్ చేశారు. హెచ్‌టీ కాంప్లెక్స్‌లో వ్యక్తిపై హత్యాయత్నం ఘటన మరువకముందే అదే కాంప్లెక్స్‌లో మద్యం సీసాలు పట్టుబడడం కలకలం సృష్టిస్తోంది. తిరుమలలో నిఘా కరువైందంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికంగా వ్యాపారం చేసుకుంటున్న దుకాణందారుడు నిన్న రాత్రి షాపులోనే మద్యం పార్టీ చేసుకుంటుండగా సమాచారం అందుకున్న విజిలెన్స్ సిబ్బంది దుకాణంపై దాడి చేయగా.. ఐదు మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. అలాగే మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజులుగా వారు తిరుపతి నుంచి తిరుమలకు మద్యం బాటిళ్లు తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్నట్లు అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. గతంలో కూడా ఆ షాపు యజమానిపై పలు కేసులు నమోదయినట్లు తెలియవచ్చింది. ఆదివారం ఉదయం టీటీడీ విజిలెన్స్, రెవెన్యూ అధికారులు..ఆ షాప్‌ను సీజ్ చేశారు. తిరుమల కొండపై మద్యం, మాంసం, గుట్కాలను ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే.
కాగా తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. వైసీపీ జెండాతో ఓ వాహనం తిరుమలకు వచ్చింది. ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు అంటూ జీపుపై జెండా ఉంది. అయితే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దానిని పట్టించుకోలేదు. వైసీపీ జెండాతోనే ఆ వాహనం తిరుమలలో చక్కర్లు కొట్టింది.