బైపాస్ రోడ్డు వద్దు వ్యవసాయ భూములే ముద్దు
హ్యూమన్ రైట్స్ టుడే/మెదక్ జిల్లా /మే 21:
రామాయంపేట, మెదక్ నుంచి సిద్దిపేట జిల్లా కేంద్రం వరకు మంజూరైన నేషనల్ హైవేలో భాగంగా రామాయం పేట వద్ద బైపాస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడాన్ని స్థానిక రైతులు, వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. రెవెన్యూ అధికారులు భూసేకరణకు సంబంధించి ఐదు రోజుల కింద నోటీసులు జారీ చేయగా మూడు రోజుల కింద రామాయంపేటలో రాస్తారోకో నిర్వహించారు. ఇప్పటికే ఓ హైవేకు భూమిలిచ్చామని, మరో హైవేకు కూడా ఇస్తే తామెలా బతకాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైసాస్ రోడ్డును పట్టణంలో నుంచే నిర్మించాలని, లేదంటే బిజినెస్‌లు దెబ్బతిని తీవ్రంగా నష్టపోతాయని వ్యాపారులు వాపోతున్నారు.
34.04 ఎకరాలు అవసరం
మెదక్ నుంచి సిద్దిపేట వరకు 69 కిలోమీటర్ల మేర నేషనల్ హైవే (765 డీజీ ) నిర్మాణానికి రూ.882 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటికే పనులు ప్రారంభం కాగా.. ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా, ఈ హైవే నిర్మాణంలో భాగంగా రామాయంపేట పట్టణ పరిధిలో 44 నెంబర్ నేషనల్ హైవే ను క్రాస్ చేసేందుకు బైపాస్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటికే సర్వే చేసి 34.04 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడంతో పాటు రోడ్డు వెళ్లే భూముల రైతులు, ప్లాట్ల ఓనర్లకు నోటీసులు కూడా జారీ చేశారు.
హైదరాబాద్-నాగపూర్హైవేకు భూములిచ్చిన రైతులు
రామాయంపేట రైతులు ఇదివరకే హైదరాబాద్–నాగపూర్ నేషనల్హైవే విస్తరణకు భూములిచ్చారు. హైవేకు ఇవ్వగా మిగిలిన భూమిని ప్రస్తుతం సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు మరో హైవేకు బైపాస్ పేరిట ఆ భూములు కూడా తీసుకుంటే బతుకుదెరువు ఉండదని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రామాయంపేట పట్టణ పరిధిలో ఎకరా భూమి రూ. 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు పలుకుతోందని, ప్రభుత్వం లక్షల్లో పరిహారం ఇస్తే ప్లాటు రాదని మండిపడుతున్నారు. భూములతో పాటు కొందరి రెసిడెన్షియల్ ప్లాట్లు కూడా పోతుండడంతో వాటి ప్లాట్ల ఓనర్లు సైతం టెన్షన్‌లో ఉన్నారు. పైసాపైసా కూడబెట్టి ప్లాటు కొన్నామని అదికాస్తా తీసుకుంటే పిల్లల పెళ్లిళ్లు, చదువుల సంగతేందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు టౌన్ బయటి నుంచి బైసాస్ వేస్తే వెహికిల్స్ పట్టణంలోకి రావని, దీంతో తమ బిజినెస్ దెబ్బతింటుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బైపాస్ వద్దంటూ ఆందోళనలు
రామయంపేట టౌన్ బయటి నుంచి బైపాస్ రోడ్డుకు బదులు పట్టణం మధ్యలో నుంచి అన్ని వెహికిల్స్ వెళ్లేలా హైవే నిర్మించాలని రైతులు, వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మరో బైపాస్ రోడ్డు నిర్మించొద్దంటూ గతంలో సర్వేను అడ్డుకున్నారు. పట్టణ బంద్ పాటించారు. మంత్రి, ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. కానీ ఇదివరకు ఉన్న అలైన్ మెంట్ ప్రకారమే పట్టణం వెలుపల నుంచి మరో బైపాస్ రోడ్డు నిర్మించే దిశగా కార్యాచరణ మొదలైంది. రెవెన్యూ అధికారులు భూములు కోల్పోయే రైతులకు ఇటీవల నోటీసులు జారీ చేశారు. దీంతో గత గురువారం రైతులు, వ్యాపారులు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు.
కోటిన్నర నష్టపోతా
రామాయంపేట పట్టణంలోని మెదక్ రోడ్డులో ఆరేళ్ల కింద 400 గజాల ప్లాట్ కొన్న. ప్రస్తుతం ఆ స్థలం విలువ కోటిన్నర దాకా ఉంటుంది. ఇప్పుడు అందులో నుంచి బైపాస్ రోడ్డు వేస్తామని అధికారులు నోటీసులు ఇచ్చారు. పైసా పైసా కూడబెట్టి కొన్న జాగా ఇప్పుడు రోడ్డు కోసం తీసుకుంటే మా పరిస్థితి ఏంది..? పట్టణంలోని పాత రొడ్డునే మరింత వెడల్పు చేస్తే ఎవరికీ నష్టం జరగదు.