రంగారెడ్డి జిల్లాలో భార్య గొంతు కోసిన భర్త
హ్యూమన్ రైట్స్ టుడే/రంగారెడ్డి: జిల్లాలోని జాన్వాడ గ్రామంలో నివాసముంటున్న ఆర్ఎంపీ డాక్టర్ నాగరాజు సుధా, ఆ దంపతులకు ఇద్దరు కుమారులు. కొద్ది రోజులు వారి కాపురం సజావుగా సాగింది. ఈ మధ్యే కుటుంబ కలహాలు వారి మధ్య చిచ్చురేపాయి. క్షణికావేశానికి లోనైన ఆ భర్త భార్య గొంతుకోసి హత్యచేశాడు. ఇది గమనించిన వారి కుమారుడు తండ్రికి అడ్డుపడ్డాడు. దీంతో ఆ బాలుడిని చంపేందుకు ప్రయత్నించాడు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని సదరు బాలుడు తన తమ్ముడిని తీసుకొని బయటకు పరుగు తీసి వారి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇంటి పక్కన వారి దగ్గరకు వెళ్లి భయపడుతూ తమ ఇంట్లో జరిగినదంతా చెప్పారు. చిన్నారులు చెప్పిన విషయంతో షాకైన స్థానికులు వారి ఇంటికి వెళ్లి చూసేసరికి భార్యాభర్తలిద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. భార్యను చంపిన తర్వాత భర్త ఆత్మహత్య చేసుకున్నాడని భావించి వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ నాగరాజు, సుధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి దీక్షిత్, అక్షిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శనివారం రాత్రి ఏదో విషయంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరింది. కోపంలో నాగరాజు.. కత్తితో భార్య సుధ గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు.
శనివారం రాత్రి అమ్మనాన్న గొడవపడ్డారు. ఇంతలో ఏమైందో కానీ అమ్మను.. నాన్న కత్తితో గొంతుకోసి చంపేశాడు. నన్ను కూడా చంపాలని చూశాడు. నేను తప్పించుకొని తమ్ముడిని తీసుకొని బయటకు వచ్చాను. జరిగిన విషయాన్ని చుట్టుపక్కలా వారికి చెప్పాను. వారు వచ్చిచూసే సరికి మా అమ్మ చనిపోయింది. నాన్న కూడా పక్కనే చలనం లేకుండా పడి ఉన్నాడు. ఇది గమనించిన పెద్ద కుమారుడు దీక్షిత్.. తల్లిని చంపుతుండగా అడ్డురాగా ఆ బాలుడినీ చంపేందుకు నాగరాజు ప్రయత్నించాడు. భయపడ్డ దీక్షిత్ తన తమ్ముడిని తీసుకొని ఇంట్లో నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. భార్యను హత్య చేసిన అనంతరం విషం తాగి నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. దీక్షిత్ సమాచారంతో నాగరాజు ఇంటికి వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు వివరాలు సేకరించారు. దంపతుల మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నాగరాజు కుమారులు ఇచ్చిన వివరాలతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.