తెలంగాణ గవర్నర్ 2000 నోటు పై ఆసక్తికర వ్యాఖ్యలు
హ్యూమన్ రైట్స్ టుడే/చెన్నై/ మే 21:
నేను వేసుకునే కోటు… నా వద్దనున్న నోటు తెలుపే.. కనుక రెండు వేల రూపాయల నోట్ల చెలామణీ రద్దయినా నాకు బాధలేదు’ అంటూ తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చమత్కరించారు. రిజర్వుబ్యాంక్ 2 వేల రూపాయల చెలామణీని రద్దు చేస్తూ వెలువరించిన ఉత్తర్వుపై ఆమె ఆదివారం వ్యాఖ్యలు చేశారు. పుదుచ్చేరిలో ఓ ప్రైవేటు కళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్న తమిళిసై మీడియాతో మాట్లాడుతూ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పకూడదని, పరీక్షలనేవి జీవితంలో భాగం మాత్రమేనని చెప్పారు. పరీక్షలు రాయలేకపోయినవారిలో పలువురు జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగారని, విద్యార్థులు ఆత్మస్థయిర్యంతో ముందుకు సాగాలన్నారు. విద్యార్థులకు ఆత్మరక్షణ సంబంధిత క్రీడలు నేర్పాలని, ఈ విషయమై పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి విద్యాశాఖ మంత్రికి సూచనలు కూడా ఇచ్చానని తెలిపారు. కేంద్ర పాలిత రాష్ట్రాల గవర్నర్ల అధికారాలకు సంబంధించిన సుప్రీంకోర్టు ఉత్తర్వు ఢిల్లీ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుందన్నారు. పుదుచ్చేరి కి సంబంధించి తనకు ముఖ్యమంత్రికి ఎలాంటి మనస్పర్థలు లేవన్నారు. ముఖ్యమంత్రి కి తనకు మధ్య విబేధాలు చోటుచేసుకోవాలని మాజీ సీఎం నారాయణాస్వామి ఆశ పడుతున్నారని ఆమె విమర్శించారు. కాగా 2 వేల రూపాలయ నోట్ల రద్దుపై తమిళిసై వృత్తి రీత్యా డాక్టర్ కనుక ఆమె తెల్లకోటు ధరిస్తుండటాన్ని సూచించేలా ఈ వ్యాఖ్యను చేశారు. కోటు మాత్రమే కాదు తన నోటు తెలుపేనంటూ తన వద్ద ఎలాంటి నల్లధనం లేదని పరోక్షంగా పేర్కొన్నారు. గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు విలేకరులకు నవ్వుపుట్టించాయి.