కరీంనగర్ నుండి తిరుమల కు ఐ ఆర్ సిటిసి టూర్ ప్యాకేజీ
హ్యూమన్ రైట్స్ టుడే/కరీంనగర్ /మే 20:
తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లాలనుకుంటున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా భక్తులకు ఐఆర్ సీటీసీ శుభవార్త ప్రకటించింది. తక్కువ ఖర్చులో శ్రీవారి దర్శనంతో పాటు తిరుపతి, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, తిరుచానూర్, శ్రీకాళహస్తి ఆలయాలను కవర్ చేస్తూ ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చింది. సప్తగిరి పేరుతో వచ్చే నెల 1 నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. మూడు రాత్రులు, నాలుగు రోజులు కొనసాగే ఈ టూర్ కు రూ.5 వేల ఖర్చుతో శ్రీవారి దర్శనం, వసతి, భోజనం తదితర సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించింది. ప్రతీ గురువారం కరీంనగర్, వరంగల్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
టూర్ ఇలా సాగుతుంది..
మొదటి రోజు: కరీంనగర్ లో రాత్రి 7:15 గంటలకు రైలు ఎక్కడంతో టూర్ మొదలవుతుంది. రాత్రంతా ప్రయాణించి ఉదయానికి తిరుపతి చేరుకుంటారు.
రెండవ రోజు:
తిరుపతిలో ఐఆర్ సీటీసీ ఏర్పాటు చేసిన హోటల్ లో ఫ్రెష్ అప్ అయిన తర్వాత శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుచానూరు ఆలయాల సందర్శన. సాయంకాలం తిరుపతికి తిరిగిరాక, హోటల్ లో భోజనం, రాత్రి విశ్రాంతి.
మూడో రోజు:
ఉదయం బ్రేక్ ఫాస్ట్ పూర్తిచేసి వెంకన్న ప్రత్యేక దర్శనం కోసం తిరుమలకు ప్రయాణం. స్వామి దర్శనం తర్వాత రాత్రి 8:15 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరే ట్రైన్ ఎక్కాలి.
నాలుగో రోజు:
నాలుగో రోజు ఉదయం కరీంనగర్ చేరుకోవడంతో టూర్ పూర్తవుతుంది.
ప్యాకేజీ ధరలు..
స్టాండర్డ్ క్లాసులో ట్రిపుల్ ఆక్యుపెన్సీ ప్యాకేజీ తీసుకుంటే ఒక్కొక్కరికీ రూ.5,660 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులోనే ప్రయాణ, వసతి, భోజన ఖర్చులు, శ్రీవారి దర్శన టికెట్ ఖర్చు కలిసి ఉంటాయి. షరతులు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. అదేవిధంగా, కంఫర్ట్ ప్యాకేజీలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ.9,010, ఇద్దరు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ.7,640, ముగ్గురు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరూ రూ.7,560 చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ.7,120 గా.. డబుల్ ఆక్యూపెన్సీకి రూ.5,740గా అధికారులు రేటు నిర్ణయించారు.