రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేవు: ఆబ్కారీ అధికారులు

Get real time updates directly on you device, subscribe now.

రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేవట..ఆబ్కారీ అధికారుల హాస్యం..

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ / మే 20:
తెలంగాణలో అస్సలు బెల్ట్ షాపులు లేవట. పల్లెల్లో మద్యమే అమ్మడం లేదట. గ్రామాల్లో నివసించే జనాలు..పనికట్టుకుని..పైసలు పెట్టుకుని మండల కేంద్రాల్లోని వైన్ షాపులకు వెళ్లి మరీ మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారట. ఈ విషయాన్ని తెలంగాణ ఆబ్కారీ శాఖ స్వయంగా.. అధికారికంగా ప్రకటించింది. తెలంగాణలోని జిల్లాల్లో బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయో తెలపాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని కోరింది. దీనికి సమాధానంగా రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేవని ఆబ్కారీ శాఖ అద్భుతమైన సమాధానం ఇచ్చింది.

*అసలు నిజం ఏంటి*

రాష్ట్రంలో 2620 వరకు వైన్ షాపులు ఉన్నాయి. వీటితో పాటు మరో 1800 బార్ అండ్ రెస్టారెంట్లు నడుస్తున్నాయి. అయితే ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ ద్వారా రూ. 36 వేల కోట్ల ఆదాయం అర్జించాలని ప్రభుత్వ టార్గెట్. ఈ ఆదాయంపై ప్రభుత్వం బడ్జెట్లో కూడా అంచనా వేసింది. 2022లో జనవరి 1 నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు ఏకంగా రూ.34,117 కోట్ల విలువ చేసే లిక్కర్ అమ్మి ప్రభుత్వం ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. ఈ ఏడాది 36 వేల కోట్ల ఆదాయమే టార్గెట్గా ప్రభుత్వం ముందుకుపోతుంది. ఇందుకు పల్లెలను ఉపయోగించుకుంటోంది.

గ్రామాల్లో మద్యం ఏరులై…
రాష్ట్రంలో 12769 గ్రామ పంచాయితీలున్నాయి. తెలంగాణలో మండల కేంద్రాల్లో 2620 వరకు వైన్ షాపులుండగా..వాటికి అనుబంధంగా కనీసం 5 నుంచి 6 వరకు బెల్ట్ షాపులు ఊర్లో నడుస్తున్నాయి. ఈ షాపులకు వైన్స్ దుకాణాలే మద్యాన్ని సరఫరా చేస్తున్నాయి. దీని ప్రకారం గ్రామాల్లో కనీసం నాలుగైదు బెల్ట్ షాపులున్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే రాష్ట్రంలో లక్షా 10 వేల వరకు బెల్ట్ షాపులు ఉండే అవకాశం ఉంది. ఈ బెల్ట్ షాపులు 24 గంటల పాటు మద్యాన్ని అమ్ముతున్నాయి. ఈ దందా అనధికారికం. బెల్టు షాపుల ద్వారా యథేశ్చగా మద్యం అమ్ముతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

బెల్టు షాపులంటే ఏవీ..
బెల్టు షాపులంటే ప్రత్యేకంగా షాపులుండవు. కిరాణా షాపులు, కల్లు దుకాణాలు, కొన్ని గ్రామాల్లో స్వీట్ షాపులు. ఇవే బెల్టు షాపులకు అడ్డా. వీటి ద్వారానే గ్రామాల్లో మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. వైన్ షాపుల కంటే బెల్టు షాపుల్లో అధికంగా వసూలు చేస్తారు. అయితే మండల కేంద్రానికి వెళ్లి మద్యాన్ని తెచ్చుకోలేని వారు..గ్రామాల్లోని బెల్టు షాపుల్లోనే అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు.

జీవితాలే నాశనం అవుతున్నా..
బెల్టు షాపుల ద్వారా గ్రామాల్లో కుటుంబాలు ఛిద్రం అవుతున్నాయి. చేసిన కష్టం మందుకు పెడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బెల్టు షాపుల వల్ల జీవితాలకు జీవితాలే నాశనం అవుతున్నాయి.. కానీ ప్రభుత్వం మాత్రం అస్సలు బెల్ట్ షాపులే లేవంటూ నంగనాచి కబుర్లు చెబుతుండటం గమనార్హం. గ్రామాల్లోకి వెళ్లి ఎవరిని అడిగినా..మద్యం ఎక్కడ దొరుకుతుంది అని ప్రశ్నించినా..చెప్పేస్తారు. బెల్టు షాపుల్లో యథేశ్చగా మద్యం అమ్ముతున్నట్లు కళ్ల ముందు కనిపిస్తున్నా..బెల్ట్ షాపులు లేవంటూ ప్రభుత్వం బుకాయించే ప్రయత్నిం చేస్తోంది. ఆబ్కారీ శాఖ ప్రకటన పూర్తిగా అబద్దం అని అర్థమవుతోంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment