తెలుగుజాతి వేగుచుక్క- తాతాజీ !

Get real time updates directly on you device, subscribe now.

తెలుగుజాతి వేగుచుక్క- తాతాజీ !

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్: తాతాజీగా సాహిత్య లోకానికి పరిచితులైన తాపీ ధర్మారావు తెలుగు సారస్వతాన్ని సుసంపన్నం చేసిన మహా వ్యక్తులలో ఒకరు. “వెయ్యి ముఖాలతో వెలిగిన జీవితం. పూల బాటలు, ముండ్ల పుంతలు, అగాధమైన పల్లాలు, ఆకాశన్నంటే మెరకలు అన్నీ తొక్కుకుపోయిన జీవితం” ఆయనది. బరంపురంలో పుట్టిన బండారు ధర్మారావు తెలుగు నేలమీద తాపీ ధర్మారావుగా ప్రసిద్ది చెందారు.ఉత్తరాంధ్ర,ఒడిస్సా, తెలంగాణ, రాయలసీమ, తమిళ నాడు వంటి పలు ప్రాంతాల్లో, సంస్థానాలలో పనిచేసినాయన సాంస్కృతికోద్యమాల ప్రతిష్ఠను ఇనుమడింప చేసిన చుక్కాని. సాహిత్యం కవిత్వం, చిత్ర లేఖనం, గణితం, నాటకాలు,వ్యాయామం ఇలా పలు అంశాల్లో ఆసక్తి కనబర్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి. చేమకూర వెంకటకవి గురించి సాధికారి కంగా చెప్పగల ఏకైక వ్యక్తి. వేగుచుక్క గ్రంథమాల వ్యవస్థాపకులు. స్వతంత్ర పరిశోధకులు, సంఘ సంస్కర్త, మూఢ నమ్మకాలను చీల్చి చెండాడిన హేతువాది. సమదర్శని, కొండెగాడు, ప్రజా మిత్ర, జనవాణి, కాగడా వంటి పత్రికల ద్వారా ప్రజానీకానికి ప్రత్యామ్నాయ రాజకీయ భావాలను చేరువ చేసిన పాత్రి కేయులు. అంతే కాదు, తెలుగులో ప్రజా పక్షంగా ఆలోచించే పాత్రికేయులతో ‘ ఆంధ్ర రాష్ట్ర పత్రికా రచయితల సంఘ ‘ స్థాపకులు, దానికి మొదటి అధ్యక్షులు కూడా. ఇవన్నీ ఒకెత్తయితే, బ్రాహ్మణే తరోద్యమ తాత్విక ధోరణిని జీవితాంతం తన రచనా వ్యాసంగంలో కొనసాగించి, స్వతంత్ర అలోచనా విధానాన్ని బలోపేతం చేసిన ఆత్మగౌరవ ఉద్యమకర్తగా తాతాజీ ప్రస్థానం మరొకెత్తు !

పానుగంటి, గిడుగు వంటివారి ప్రభావంతో మొదట్లో గ్రాంథిక వాదిగా ఉన్నప్పటికీ, తర్వాత కాలంలో చిరస్థాయిగా నిలిచి పోయే అనేక రచనల్ని సామాన్య ప్రజలకి చేరువయ్యే రీతిలో వ్యావహారిక భాషలో రచించిన చెయ్యి తిరిగిన రచయిత. పాతపాళీ నుంచి కొత్తపాళీ లోకి కొనసాగిన పాతకొత్తల మేలు కలయిక తాతాజీ. “ఆయన రాసింది చూసి నేర్చుకున్నామ” ని నార్ల అంతటి వ్యక్తే చెప్పగలిగిన సామర్ధ్యం తాపీ వారి సొంతం. సంజీవ్ దేవ్ మొదలు కొని బోయి భీమన్న వరకూ ఆనాడు తాపీ వారి స్పూర్తి వెలుగులు ప్రసరించని వ్యక్తిత్వం లేదంటే అతిశయోక్తి కాదు. “ఉన్నది కన్నటు వ్రాయుట కన్న గవికి మేలు లేదు” అన్నా యన హేతువాద వైజ్ఞానిక దృక్పధాన్ని, ప్రశ్నించే స్వభావాన్ని ప్రచారం చేసిన తీరు అద్భుతం. దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు ? ఇనుప కచ్చడాలు,పెళ్ళి – దాని పుట్టు పూర్వోత్తరాలు, తాతాజీ చేసిన ఈ మూడు రచనలు భావోద్యమాల చరిత్రని అనూహ్యంగా మలుపు తిప్పాయి. మానవ పురా చరిత్ర అధ్యయనం ద్వారా ఆయన శోధించి, వెల్లడించిన అనేక అపూర్వమైన విషయాలు, ఆయా రంగాల్లో ఎందరో అన్వేషకులకు, పరిశోధకులకు మార్గదర్శకంగా ఉపయోగ పడ్డాయి. ఆరుద్ర నుండీ తిరుమల రామచంద్ర వరకూ తాతాజీ ప్రేరణతో పరిశోధనల పై ఆసక్తి పెంచుకున్న మహామహులు ఎందరో ఉన్నారు. ఆ రకంగా తెలుగు సారస్వతాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఘనత నిస్సందేహంగా తాతాజీదే. ఇవి కాక ఆలిండియా అడుక్కు తినేవాళ్ళ మహాసభ, ఇంకా కొన్ని నాటికలు రాసారు. రాలూ, రప్పలూ పేరుతో ఆత్మకథ రాసారు.తర్కబద్ద మైన వ్యంగ్యం, సున్నితమైన హాస్యం రంగరించీ, భాషలో ఎన్నో కొత్త పదబంధాల్నీ, వాక్య నిర్మాణంలో ప్రయోగాల్నీ చేసారు. జన సామాన్యానికి చేరువయ్యే సరళమైన భాషకి పట్టం కట్టారు !

కందుకూరి, గురజాడ, గిడుగు వంటి వారి అడుగుజాడల్లో సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించిన ఉద్యమకారుడు తాతాజీ. వేదం వెంకటరాయ శాస్త్రి అంతటి మహా పండితుడు రాసిన విజయ విలాస వ్యాఖ్యానంలో తప్పులు ఎత్తి చూపడమే కాకుండా, ఆంధ్రదేశంలో అనేకచోట్ల పండితులతో తన విమర్శ పై ప్రతివిమర్శల్ని ఆహ్వానిస్తూ సమావేశాలు నిర్వహించారు. అంతేకాదు, ఏకంగా వెంకట రాయశాస్త్రి గారు ఉండే నెల్లూరు లోనే సభ ఏర్పాటు చేసి అందరి చాత శహభాష్ అనిపించుకొని మన్ననలు పొందిన వ్యక్తి తాతాజీ. చల్లపల్లి రాజా వారి కుమారుడి అక్షరాభ్యాసం సందర్భంలో సాంప్రదాయ తంతుని నిరసిస్తూ, ఓనమాలుగా పిలువబడే ఓం నమశ్శివాయ మంత్రానికి బదులు అ, ఆ లే రాయించి అక్షరాభ్యాసం చేయించిన ధైర్యశాలి. అది విమర్శించిన ఛాందసుల నోళ్ళు మూతపడేలా బహిరంగ చర్చకు సవాలు విసిరిన ధీశాలి. అంతేనా ! “చెప్పేదంతా తప్పుడు చదువేనా? తెలుగువారి అక్షరాభ్యాసంలో అవకత వకలు” అంటూ, విశ్లేషణాత్మక వ్యాసం కూడా రాసి మన విద్యావిధానంలోని లోపాలను సోదాహరణంగా ఆనాడే విమర్శించిన కార్యశూరుడు తాపీ ధర్మారావుగారు !

ఇంతకుమించిన ముఖ్యమైన చారిత్రక ఘటన మరొకటుంది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా ఉర్కాడు సంస్థానంలో తాపీ వారు పని చేసేవారు. అక్కడ దేవీ నవరాత్రులు సందర్భంగా జరిగిన గోష్టిలో, తిరుగులేని ఆధ్యాత్మిక గురువైన శృంగేరి శారదా పీఠాధిపతి, జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరా చార్యుల వారి ముందు తాతాజీ, భాష,లిపి మూలాల్ని తడుముతూ తాను రాసిన, “అక్షర శారదా ప్రసంశ” అనే పద్య కవిత్వం చదివి వాహ్వా అనిపించుకుని, దుశ్శాలువాతో “ఆంధ్ర విశారద” అనే బిరుదు పొందారు. ఒక ప్రగతిశీల భావాలుగల వ్యక్తి హేతువాద దృష్టితో రాసిన కవితకి గానూ, తిరుగులేని ఆధ్యాత్మికవేత్త నుండి అంతటి సత్కారాన్ని అందుకోవడం అనేది అప్పటి వరకూ ఎన్నడూ జరగనిది. ఆ రకంగా భావోద్యమాలకి దక్కిన అరుదైన గౌరవం. బహుశా అందుకే, తర్వాత కాలంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు మొదలుకొని ఎన్ని బిరుదులు, సత్కారాలు తాతాజీని వరించినా, చివరి వరకూ ఆంధ్ర విశారద గానే కొనసాగారు !

ఎనభై ఏళ్ళ క్రితం 1943లో తెనాలిలో జరిగిన మొదటి అభ్యుదయ రచయితల సభలు మొదలు కొని యాభై ఏళ్ళ క్రితం 1970లో విశాఖలో జరిగిన శ్రీ శ్రీ షష్టిపూర్తి సభలకి కూడా ఆరోగ్యం అంతగా సహకరించ కపోయినా వచ్చి అధ్యక్ష స్థానంలో దిశానిర్దేశం చేసిన క్రియాశీలి తాతాజీ. వందల సంఖ్యలో ఆదర్శ వివాహాలు చేసారు. సొంత కుటుంబం నుండే ప్రజాతంత్ర భావాలకిగాను పెద్దపీట వేశారు. వామపక్ష సానుభూతి పరుడిగ ఎదిగారు.టాల్ స్టాయ్ రచన అన్నాకెరినాను తెలుగులోకి అనువ దించారు. మద్రాసు లో రాజాజీ హాల్లో తెలుగు సంస్కృతీ సభల్లో అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ, “సంస్కృతి అంటే మానవుడు స్వయం కృషి వలన అలవర్చుకునే ప్రతీదీ అని అర్థం. స్వయం గుణాలు, ఇనిస్టింక్టులు, ఆ తర్వాత మనిషి సంపాదించు కునే విజ్ఞానమే సంస్కృతి.” అంటారు. అలా సాంస్కృతిక వికాసానికి తనవంతు కృషి చేసిన తాతాజీ చలనచిత్ర రంగంలో కూడా తన ముద్ర వేశారు. మాలపిల్ల, రైతుబిడ్డ, ఇల్లాలు, రోజులు మారాయి, కీలు గుర్రం, పల్లెటూరి పిల్ల, కృష్ణ ప్రేమ, పరమానం దయ్య శిష్యుల కథ మొదలైన సినిమాలకి సంభాషణలు రాసారు. ఆంధ్రదేశంలో వెల్లువెత్తిన ప్రతీ నూతన ఆవిష్కరణనీ నిబద్దతతో తనవంతు పరిపుష్టం చేసిన మహావ్యక్తి తాతాజీ. అందుకే ఆయన జయంతి ఐన సెప్టెంబరు 19ని తెలుగు మాధ్యమాల దినోత్సవంగా జరుపుకుంటాం !

చాలా కాలంపాటు మద్రాసులో ఉన్నాయన తర్వాత హైదరాబాదుకి మకాం మార్చారు. చివరివరకు సాహిత్యసభలు, సమావేశాలు, పుస్తక ప్రచురణలు, మిత్రులతో పిచ్చాపాటీ, ఇవికాక కాఫీ, పొగాకు చుట్ట కూడా వదల్లేదు. భార్య అన్నపూర్ణమ్మ చని పోవడం ఆయనకి పెద్ద లోటు. అయినా నెమ్మదిగా కూడ దీసుకున్నారు. అప్పటికే ఎగ్జిమా,ఆస్తమా వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, 1973 మే 8 న హైదరాబాదులోని కుమారుడి ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. తెలుగు సాహిత్యాన్ని తనదైన ఒరవడిలో ఓలలాడించి, ప్రగతిశీల ఉద్యమాలన్నింటి మీద ధిక్కారపు వెలుగుల్ని ప్రసరించిన “వేగుచుక్క’ గా తెలుగు ప్రజల గుండెల్లో ‘తాతాజీ’ గా ఎప్పటికీ నిల్చిపోతారు. “తాపీ ధర్మారావు, జీవితం – రచనలు” పేరిట విశాలాంధ్ర ప్రచురించిన డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ గారి పరిశోధనా ఉద్గ్రంథం తాతాజీ జీవితానికి సంబంధించిన వివిధ పాశ్వాల్ని సమగ్రంగా దర్శించేందుకు జరిగిన ఒక విశిష్ట ప్రయత్నం. ప్రతీ కవి, రచయిత, కళాకారుడు, తత్వవేత్త, పాత్రికేయుడు, పరిశోధకుడు, ప్రగతిశీల అభ్యుదయ ఆలోచనాశీలి తప్పనిసరిగా తెలుసుకుని తీరాల్సిన విశిష్ట వ్యక్తిత్వం తాపీ ధర్మారావు గారిది. తెలుగు నేల మీద ఆయన వికసింపజేసిన భావాల ప్రభావం అపారం. భావితరాలు కూడా ఆ మేధోసంపత్తి నుండి స్పూర్తిని పొంది మూఢత్వపు చీకట్లను చీల్చే ఆయన అక్షర కాంతుల సాయంతో తెలుగు సారస్వతాన్ని సమున్నతంగా నిలిపేలా కృషి చేయడమే ఆయనకి ఇవ్వదగ్గ నివాళి !

(మే 8 తాతాజీ 50 వ వర్ధంతి సందర్భంగా)

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment