భూమికి దగ్గరగా గ్రహశకలం.. పడితే ఓ నగరమే ఖతం..
గ్రహ శకలాలు, తోక చుక్కలు అత్యంత అరుదుగా భూమి సమీపంలోకి వస్తుంటాయి. దశాబ్ధాలకు ఒకసారి మాత్రమే ఇలాంటి ఖగోళ అద్భుతాలు జరుగుతుంటాయి. అయితే కొన్నిసార్లు గ్రహశకలాలు భూమికి ప్రమాదాన్ని తెచ్చే అవకాశం కూడా ఉంది. డైనోసార్ల వంటి భారీ జంతువులు భూమిపై తుడిచిపెట్టుకుపోవడానికి కారణం ఓ గ్రహశకలం భూమిని ఢీకొట్టడమే అని అందరికి తెలిసిన విషయం.
ఇదిలా ఉంటే 2023 డీజెడ్2 అనే గ్రహశకలం భూమి, చంద్రుడికి కక్ష్యల మధ్య నుంచి ప్రయాణించబోతోంది. ఈ ఖగోళ అద్భుతం శనివారం చోటు చేసుకోబోతోంది. ఈ గ్రహ శకలాన్ని ఒక నెల క్రితం కనుగొన్నారు. ఒక నగరాన్ని తుడిచిపెట్టగలిగేంత పరిమాణంలో ఉన్న దీని వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేదు. శనివారం భూమికి 1,68,000 కిలోమీటర్ల దూరం నుంచి గ్రహశకలం వెళ్తోంది. ఇది భూమి చంద్రుల మధ్య దూరం కన్నా సగం దూరమే. దీంతో ప్రపంచ శాస్త్రవేత్తలు దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. అత్యంత దగ్గరగా రావడం చాలా అరుదుగా జరుగుతుంది కాబట్టి గ్రహశకలాన్ని అధ్యయనం చేసే అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. దీన్ని బైనాక్యులర్లు, చిన్న టెలిస్కోపుల సాయంతో చూడవచ్చు.
సాధారణంగా ఆస్టారయిడ్ ఫ్లైబైస్ సాధారణంగా జరుగుతుంటాయి. అయితే పెద్ద గ్రహశకలాలు రావడం చాలా అరుదు. ఇలాంటివి దశాబ్ధానికి ఒకసారి మాత్రమే జరుగుతాయి. శాస్త్రవేత్తలు దీని పరిమాణాన్ని 40-90 మీటర్ల మధ్య ఉంటుందని అంచానా వేస్తున్నారు. ఈ గ్రహశకలాన్ని ఫిబ్రవరి 27న గుర్తించారు. యూరోపియన్ నియర్ ఎర్త్ ఆస్ట్రరాయిడ్స్ రీసెర్చ్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని గుర్తించారు. దీన్ని గుర్తించే సమయానికి ఇది భూమికి 159 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రహశకలం సూర్యడి చుట్టూ ఓ భ్రమణం చేయడానికి 3.16 ఏళ్లు తీసుకుంటుంది. ఇది 2026లో మరోసారి భూమికి దగ్గరగా వస్తుంది. ఆ తరువాత 2029లో భూమికి మరింత దగ్గర వచ్చే అవకాశం ఉందని, భూమిని ఢీకోట్టే అవకాశాలను కూడా తోసిపుచ్చలేమని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.