*కేసీఆర్ ముందస్తు నగారా!?*
*కవిత విచారణతోనే ముడిపడిందా..?*
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్: ఊహించని వ్యూహాలు, ఎత్తుగడలతో ప్రత్యర్థులను బోల్తాకొట్టించడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు మరో మాస్టర్ స్ట్రోక్‌కు సిద్ధమయ్యారా?… ముందస్తు ఎన్నికల వ్యూహంతో విపక్ష నేతలను ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నారా?… 2019 మాదిరిగానే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు సీన్‌ను రిపీట్ చేయబోతున్నారా?… ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎంఎల్‌సీ కవిత అరెస్టైతే ఎన్నికల నగారా మోగించడం ఖాయమా?… ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ కవిత విచారణ, అరెస్ట్ కూడా చేయొచ్చనే ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ఈ అంశాలే హాట్ టాపిక్‌గా మారాయి. ఒక్కసారిగా ముందస్తు ఊహాగానాలు గుప్పుమన్నాయి. మరి సీఎం కేసీఆర్ నిజంగా ముందస్తుకు వెళ్తారా?. సడెన్‌గా ఈ ప్రచారానికి కారణాలు ఏమిటో ఒక లుక్కేద్దాం…
నిజానికి సీఎం కేసీఆర్ సారధ్యంలోని రెండో దఫా సర్కార్ ముందస్తుకు వెళ్లబోతోందంటూ చాలాసార్లు జోరుగా ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ కీలక విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించిన ప్రతిసారి ఈ తరహా ఊహాగానాలను చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో తొలి భారీ బహిరంగ సభగా పేర్కొన్న ‘ఖమ్మం మీటింగ్’ సమయంలోనూ కొంతకాలం ఇదే ప్రచారం నడిచింది. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఈడీ విచారణ, అరెస్ట్ ఊహాగానాల మధ్య మరోసారి ఆ చర్చ తెరపైకి వచ్చింది. సీఎం కేసీఆర్ గురువారం హఠాత్తుగా క్యాబినెట్ భేటీ నిర్వహించడం, మరుసటి రోజు శుక్రవారమే బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి పిలుపునివ్వడం ఈ ఊహాగానాలకు ప్రధాన కారణమైంది. కవితను అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయని, అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే సానుకూల ప్రభావం ఉంటుందని, అందుకు తగిన సమయం ఇదేననేది విశ్లేషణలు, ఊహాగానాల సారాంశం.
కవిత అరెస్ట్‌తో సానుభూతి వస్తుందా?
తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే కసరత్తులు కూడా ప్రారంభించాయి. వేర్వేరు కార్యక్రమాల ద్వారా క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా ఉండి ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా నేతల విమర్శలు, ప్రతివిమర్శలు సైతం పదునెక్కాయి. ముఖ్యంగా కేంద్రం, రాష్ట్రంలోని అధికార పార్టీలైన బీజేపీ (BJP), బీఆర్ఎస్‌ల (BRS) మధ్య నువ్వా-నేనా అనే రీతిలో మాటల యుద్ధం (Words war) కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎంఎల్‌సీ కవితపై ఆరోపణలు వచ్చాక ఈ రాజకీయ వాతావరణం మరింత రంజుగా మారింది. తాజాగా కవితకు ఈడీ నోటీసులు, అరెస్ట్ చేయొచ్చనే ప్రచారం మధ్య ఈ పరిస్థితి హీటెక్కింది. బీజేపీని ప్రశ్నిస్తున్నందునే తమ నేతలపై కేంద్రం కక్షకట్టిందని… ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి వేధింపులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ దురుద్దేశంతోనే ఇబ్బంది పెడుతున్నారని ఒకింత ప్రచారం ఉంది కాబట్టి.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టైతే జనాల్లో బీఆర్ఎస్‌కు సానుభూతి వస్తుందా? అనే చర్చ ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి కవిత అరెస్ట్ బీఆర్ఎస్‌కి సానుకూలమా? ప్రతికూలమా? అనే చర్చ పక్కనపెడితే ఈ అంశమే ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు ప్రధాన కారణమైంది.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ, శుక్రవారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు ఈ చర్చకు ఆజ్యం పోశాయనే చెప్పాలి. కవిత అరెస్ట్ అయితే ఎలా వ్యవహారించాలనే అంశంపైనే బీఆర్ఎస్ చర్చించబోతోందని స్పష్టమైన సంకేతాలు రావడం.. మరోపక్క జిల్లా స్థాయి నేతలు సైతం విస్తృత స్థాయి సమావేశానికి హాజరవ్వాలంటూ సమాచారం అందివ్వడం ముందస్తు చర్చకు బలం చేకూర్చాయనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు కవిత అరెస్టయితే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక ఉద్యమాన్ని తీసుకురావాలని బీఆర్ఎస్ భావిస్తోందనే ప్రచారమూ ఉంది. మరి ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయనేది వేచిచూడాల్సిందే.