ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు సమావేశం ఏర్పాటుకు భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులేనా…

Get real time updates directly on you device, subscribe now.

హైదరాబాద్‌: భారాస పార్లమెంటరీ, శాసనసభాపక్ష, రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని శుక్రవారం (ఈ నెల 10న) మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ నేతలు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌లు, డీసీఎంఎస్‌లు, డీసీసీబీల ఛైర్మన్‌లు హాజరుకానున్నారు. ఎన్నికలకు మరో తొమ్మిది నెలల సమయమే ఉన్న నేపథ్యంలో ప్రజల్లోకి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు తీసుకెళ్లడం.. తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో తనిఖీలు, మరో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సిబ్బందిని విచారించడంతోపాటు ఇటీవల ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రశ్నించడం, తాజాగా ఈడీ నోటీసుల అంశాన్ని పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. కవితకు నోటీసుల అంశంపై మంత్రులు, భారాస నేతలందరూ పెద్దఎత్తున కేంద్రంపై ధ్వజమెత్తారు. ఈ తరుణంలో సీఎం పార్టీ విస్తృతస్థాయి భేటీ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం, భాజపా వైఖరిని ఎండగట్టడంతోపాటు పార్టీ ఎన్నికల కార్యాచరణనూ వెల్లడించే వీలుంది.

*నేడు మంత్రిమండలి భేటీ*

మరోవైపు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ మంత్రిమండలి సమావేశం జరగనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ, యాసంగి ధాన్యం కొనుగోళ్లు, కొత్త క్రీడావిధానం, పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ సహా పలు కీలక అంశాలపై చర్చించి మంత్రిమండలి నిర్ణయాలు తీసుకోనుంది. దీంతోపాటు రాష్ట్రంలో గవర్నర్‌ కోటాలో ఇద్దరు నామినేటెడ్‌ ఎమ్మెల్సీల పేర్లను ఖరారు చేయనుంది. కవితకు ఈడీ నోటీసులపై రాజకీయంగా వేడిరాజుకున్న నేపథ్యంలో మంత్రిమండలి సమావేశ నిర్ణయాలపైనా అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

*ఇద్దరు ఎమ్మెల్సీలు ఎవరు?*

గవర్నర్‌ కోటాలో ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న డి.రాజేశ్వర్‌రావు, ఫారుఖ్‌ హుస్సేన్‌ల పదవీకాలం మే నెలలో ముగుస్తోంది. ఈ రెండు స్థానాలకు ఇద్దరి పేర్లను ఎంపిక చేసి గవర్నర్‌కు సిఫార్సు చేయనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్‌ విస్తృతస్థాయిలో కసరత్తు చేశారు. రాజేశ్వర్‌రావు, ఫారుఖ్‌ హుస్సేన్‌లు మరో అవకాశాన్ని కోరుతున్నారు. దళిత, క్రైస్తవ, ముస్లిం కోటా కింద తమకు అవకాశం ఇవ్వాలని మరికొందరు ముఖ్యనేతలు సీఎంను కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల ఎమ్మెల్యేల కోటాలో మూడు స్థానాలను ఓసీలకే ఇచ్చినందున ఈసారి రెండు స్థానాల్లో ఒకటి బీసీలకు ఇస్తారనే ప్రచారమూ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌తోపాటు వీజీ గౌడ్‌, దాసోజు శ్రవణ్‌ తదితరులు ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment