ఒక్క రోజులో మూడు ఫోన్లు మార్చిన సిసోదియా..!
హ్యూమన్ రైట్స్ టుడే/దిల్లీ: మద్యం కుంభకోణంలో అరెస్టయిన దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా (Manish Sisodia)ను నేడు కోర్టులో హాజరుపర్చనున్నారు. ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా సిసోదియాను నిన్న సీబీఐ (CBI) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాత్రంతా ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రధాన కార్యాలయంలోనే గడిపారు. ఈ ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో సిసోదియాను హాజరుపర్చనున్నారు.
ఛార్జ్‌షీట్‌లో పేరు..
సిసోదియా (Manish Sisodia) అరెస్టుపై సీబీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. విచారణకు సహకరించకపోవడం వల్లే ఆయనను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. కీలకమైన అంశాలపై ఆయన సరిగా సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. తప్పించుకునే విధంగా సమాధానాలు ఇచ్చారని, విరుద్ధమైన సాక్ష్యాలను ఎదుర్కొన్నప్పటికీ దర్యాప్తునకు సహకరించలేదని ఆరోపించింది. ఈ కేసులో సిసోదియా నుంచి రాబట్టాల్సిన సమాచారం ఎంతో ఉన్నందున.. ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ.. న్యాయస్థానాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో సిసోదియా పేరు కూడా ఉన్నట్లు సీబీఐ (CBI) వర్గాలు తెలిపాయి. అయితే, ఈ కేసులో ఆయనను నిందితుడిగా పేర్కొనలేదని తెలుస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా పక్కా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే అరెస్టు చేసినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.
18 ఫోన్లు ఉపయోగించిన సిసోదియా..
సిసోదియా (Manish Sisodia) ఇతర వ్యక్తుల పేర్ల మీద అనేక ఫోన్ నంబర్లు, ఫోన్లు తీసుకున్నారని, ఆ తర్వాత వాటిల్లో కొన్నింటిని ధ్వంసం చేశారని సీబీఐ (CBI) వర్గాలు ఆరోపించాయి. ఆయన 18 ఫోన్లు, నాలుగు ఫోన్ నంబర్లు ఉపయోగించేవారని పేర్కొన్నాయి. ఒక్క రోజులోనే ఆయన మూడు ఫోన్లను మార్చినట్లు తమ దర్యాప్తులో తేలిందని చెప్పాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు.
ఆప్ దేశవ్యాప్త నిరసనలు..
సిసోదియా అరెస్టుకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేడు దేశవ్యాప్త నిరసనలు చేపట్టనుంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద భద్రతా సిబ్బంది భారీగా మోహరించారు. అటు సీబీఐ (CBI) కార్యాలయం ముందూ భద్రతను పెంచారు.