తారకరత్న ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందన్నారు: తెదేపా అధినేత చంద్రబాబు
హైదరాబాద్: నటుడు తారకరత్న మృతి చాలా బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆయన కోలుకుని మళ్లీ వస్తారని ఆశించామన్నారు. తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘చిన్న వయసులో తారకరత్న చనిపోవడం బాధేస్తోంది. సినీ రంగంలో మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తి. ఒకేరోజు 9 సినిమాలు ప్రారంభోత్సవం చేశారు. రాజకీయాలపట్ల ఆసక్తి చూపేవారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉన్నట్లు నాతో చెప్పారు. అవకాశం ఇద్దామనునకున్నాం. దీనిపై సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని ఆయనతో చెప్పాను. ఈలోపే తారకరత్న మరణించడం దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని చంద్రబాబు అన్నారు.