ఒక మనిషికి జీవితాంతం ఉండే మత్తు దేవుడు, మతం..

Get real time updates directly on you device, subscribe now.

దేవుళ్ళ దేశంలో ఆకలి కేకలా?

దేశవ్యాప్తంగా లక్షలాది గుడులు,

వేలాది చర్చిలు,

వందలాది మసీదులు,

ప్రార్థన స్థలాలు ఉన్నాయి.

ఎక్కువ సమయం తన అభివృద్ధి మీద, తన మీద జరుగుతున్న ఆర్ధిక, సామాజిక, రాజకీయ దోపిడీ మీద దృష్టి పెడతాడో..!

ఒక మనిషికి జీవితాంతం ఉండే మత్తు దేవుడు, మతం.

భారతదేశ జనాబా 140 కోట్లయితే, దేవుళ్ళ సంఖ్య ఒకే మతానికి చెందిన వారు 33 కోట్లు.

అన్య మతాలకు చెందిన వారు అదనం.

బాబాలు, స్వాములు, గురువులు పూజారులు, జ్యోతిష్యులు, వాస్తు నిపుణులు, మాంత్రికులు వీధి వీధికి కనబడతారు.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జనవరి 16:

ఇంత మంది దేవుళ్ళు ఉన్న ఈ దేశాన్ని, ఆర్య రాజులు మొదలుకొని నిన్న మొన్నటి వరకు ఈ దేశాన్ని హస్తగతం చేసుకొని, మన మీద అధికారం చెలాయించి. ఈ దేశంలోని సంపదను తరలించుకు పోయిన, ఈ దేశాన్ని పాలించిన ఆంగ్లేయులను, వారి దోపిడీని వారి హింసాత్మక ధోరణిని ఏ మత దేవుడు అడ్డుకోలేక పోయాడు.

225సంవత్సరాలు బ్రిటిష్ వాడు తన కబంధ హస్తాలో బంధించాడు, వాడు ఆడింది ఆటగా పాడిందే పాటగా మన దేశాన్ని పాలిస్తుంటే, ఏ మత దేవుడు ఆదుకోలేక పోయాడు.

ఈ దేశంలో బాబాలకు ఉన్నంత విలువ ఏ శాస్త్రవేత్తకు లేదు. ఆడంబరాలకు పోకుండా పెట్టినదేదో తిని ఉన్నటు వంటి సాయిబాబాను దేవుడిని చేశారు. దేశం నిండా నిండుకొని ఉన్న స్వామీజీలు బాబాలు తమ మాయలతో, మంత్రాలతో ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజల్ని పర రాజుల పాలనను అడ్డుకోవడం కాదు కదా! ఆకలి నుంచి, దోపిడీ నుంచి, అజ్ఞానం నుంచి, మతం, మూర్ఖత్వం, మూఢత్వాన్ని నుండి కూడా మరలించలేక పోయారు.

2022లో హంగర్ ఇండెక్స్ ప్రకారం 121 దేశాల్లో మన దేశం 107 స్థానంలో ఉందని  తెలిపింది. ఈ దేశంలో కోట్లాది మంది దేవతలు ఉన్నా, ఆకలి కేకలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ దేశంలో ఆకలి చావులకు కారణం మతం, కులం, ఆర్ధిక వెనుకబాటు, నిరక్షరాస్యత, నిరుద్యోగిత కానీ వీటన్నిటికీ కారణం మనం చేయాల్సింది చేయకుండా అన్నిటికి దేవుడి మీద భారం వేయటం దేవుడు చూసుకుంటాడు లే అని పిచ్చిగా నమ్మడం వల్లనే మన దేశం అన్ని దేశాల కన్నా ఆర్థిక సామాజిక రంగాలలో వెనుకబడి పోయింది.

ఉన్నఫలంగా ఈ దేశంలో ఉన్న గుళ్ళు, మస్జిదులు, చర్చిలు, గురుద్వారాలు అన్నిటిని స్కూల్స్ గా, హాస్పిటల్స్ గా మార్చేస్తే ఒక పది సంవత్సరాల్లో అందరికీ విద్య, అందరికీ వైద్యం సంభవమౌతుంది. అలాగే వ్యవసాయం చేసే ప్రతి రైతుకు తాను పండించిన పంటపై అధికారం ఉంటే, గిట్టుబాటు ధర తానే నిర్ణయించుకుంటే ఆకలి చావులు ఉండవు. రైతు ఆత్మ హత్యలు ఉండవు. ఆకలి కేకలు ఉండవు. ఈ దేశం మానవ అభివృద్ధిలో టాప్ 10 స్థానానికి వస్తుంది.

పిల్లల ఆకలి తీర్చలేనప్పుడు ఎంత మంది దేవుళ్ళు, గుళ్ళు ఉంటే ఎం లాభం? ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని యజ్ఞాలు, ఎంతమంది ప్రార్థనలు చేస్తే ఏమి లాభం? మాయలు లేవు మంత్రాలు లేవు అన్ని అబద్ధాలే మత గ్రంథాలన్నీ అబద్ధాలే. వీళ్లను ప్రార్థిస్తే పూజిస్తే జేబు కాళీ అవుతుంది. కంఠశోష తప్ప ఏమీ మిగలదు. బలమైన పిల్లలు ఉండాలి. పెరుగుదల ఉండాలి. శారీరక బలాన్ని బట్టి మానసిక వికాసం కూడా పెరుగుతుంది. కానీ 60% పౌష్టికాహార లోపం వల్ల ఎత్తుకు తగ్గ బరువు ఉండరు మన దేశంలో…

లక్ష్మీ దేవి ఉంటే ఎం లాభం సహారా ఆఫ్రికన్ దేశాల్లో ఉన్నంత దరిద్రం ఉంది ఇక్కడ…
సరస్వతి దేవి ఉంటే ఎం లాభం డిగ్రీలు ఉన్నోడికి కూడా జీవితం మీద, సమాజం మీద, రాజకీయం మీద  ఏమాత్రం అవగాహన ఉండదు…

ఇంకా 40% మంది ప్రజలు అసలు ఎలాంటి అక్షర జ్ఞానం లేకుండా నిరక్షరాస్యతతో చీకటిలో మగ్గిపోతున్నారు. దారిద్ర్య రేఖ దిగువన సుమారు 60 శాతం మంది ప్రజలు ఉన్నారు. ఈ దేశపు పిల్లల్లో నూటికి 80 శాతం వరకు పోషకాహార లోపం వల్ల బాధపడుతున్నారు. శిశు మరణాలు అధికంగా ఉన్నాయి. భ్రూణ హత్యలకు లెక్కేలేదు.
తల్లులకు న్యూట్రిషన్ ఫుడ్ పై అవగాహన లేకపోవడం, అనవసరమైన ఒక్క పొద్దులు, ఉపవాసాలు, మడి ఆచారాలు వల్ల ఈ దేశంలో స్త్రీలు 80 శాతం రక్తహీనతతో బాధపడుతుంటారు. ఇక పిల్లల్ని బలంగా ఎలా తయారు చేయగలుగుతారు?
స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా మన ప్రభుత్వాలు ఇంకా మన దేశం నుండి దారిద్రము, నిరుద్యోగము నిర్మూలించలేక పోయాయి. ప్రాథమికావసరాలైన కూడు, గుడ్డ, నివాసం సమకూర్చలేక పోతున్నాయి. పదవులను నిలబెట్టుకోవడానికి సమయం సరిపోవడం లేదు. వారికి ఇక ప్రజల గురించి ఆలోచన ఎక్కడిది?
ప్రజల్లో మూర్ఖత్వము, మూఢత్వము, అజ్ఞానం ఇంకా అలాగే ఉండిపోయాయి.

ప్రజలు తలపైకెత్తి “దేవుడా నన్ను రక్షించు” అంటారే తప్ప తమ యొక్క పేదరికానికి, తమ నిరక్షరాస్యతకు తమ పరిస్థితికి కారణాలు ఆలోచించరు.

ప్రజలకు తిట్టడానికి దేవుడే కావాలి.
మొక్కడానికి దేవుడే కావాలి.
సంపదలు ఇవ్వడానికి దేవుడే కావాలి.

అన్ని విధాల అభివృద్ధికి మానవుడే కారణమన్న విషయాన్ని ప్రజలు ఇప్పటివరకు గ్రహించలేదు. దేవుళ్లను నమ్మినందువల్ల కేవలం తాత్కాలిక ఉపశమనమే తప్ప,శాశ్వత పరిష్కారము కాదని తెలుసుకోలేకుంటున్నారు.
తమ యొక్క పరిస్థితికి తామే కారణమన్న ఆలోచన ప్రజలకు రావడం లేదు.

తాము ప్రశ్నించడం లేకనే ప్రభుత్వాలిలా ప్రవర్తిస్తున్నాయనే చిన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. తాము ఎన్నుకున్న ప్రభుత్వం తమనే మరిచిపోతుంటే చేష్టలుడిగి చూస్తున్నారు.

ఇంకా దేవుడ్ని, మంత్రాలను నమ్ముకొని ఎన్ని రోజులు మనల్ని మనం మోసం చేసుకుందాం, ఎన్ని రోజులు ప్రపంచ దేశాల ముందు తలదించుకుందాం…?

*దేవుడి పేరుమీద ఎవరినీ బాగు చేయలేరు.*

*కానీ ఎంతటి విద్యావంతుడినైనా మోసం చేయగలరు.*

*నిలువు దోపిడీ ఇచ్చేటట్టు చేయగలరు.*

*విగ్రహాల ముందు మోకరిల్లేటట్టు చేయగలరు.*

*ఆకాశంలో ఏం కనబడకున్నా “దేవుడా” అని అరిచేటట్టు చేయగలరు.*

*పొర్లు దండాలు తీయించగలరు.*

*తలను నేలకేసి కొట్టించగలరు.*

*చెవులు పట్టి బిస్కీలు తీయించగలరు.*

*గొంతు పగిలేటట్టుగా అరిచేటట్టు చేయగలరు.*

*తోటి మనుషుల పట్ల అమానుషంగా ప్రవర్తించేటట్టు చేయగలరు.*

*హత్యలు చేయించగలరు.*

*ఆత్మహత్యలు చేసుకోగలరు.*

*దేవుళ్ళ మీది భక్తి ఎంతటి అఘాయిత్యానికైనా పాల్పడేటట్టు చేయగలదు…*

*కలలో వచ్చి నాకు కోడిని కోయండి, మేకని కోయండి, లేకపోతే నాకు గుడి కట్టండి అనగలరు.*

*నాకు జాతరలు చేయండి కల్లు సాక పెట్టండని అనగలరు.*

*ఇలా స్వార్థ పూరితంగా చెప్పే దేవుళ్ళే తప్ప,…..*

*ఊరిలో బడి లేదు. బడి కట్టండి.*

*ఆసుపత్రి లేదు ఆసుపత్రి కట్టండి.*

*రోడ్లు బాగా లేవు, బాగు చేయించుకోండి.*

*ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. అందరికీ ఇళ్లు కట్టించండి.*

*మతాల వల్ల, మతకల్లోలాల వల్ల అశాంతి సమాజంలో కలుగుతుంది. అన్ని మతాలను నిర్మూలించుకోండి.*

*కులాన్ని, కుల వివక్షతని నిర్మూలన చేయండి.*

*అని చెప్పే దేవుళ్ళు ఎందుకు లేరు?…..*

కొందరికి అనుమానం రావొచ్చు కేవలం దేవుడ్ని, మతాన్ని నమ్మడం మానేస్తే అభివృద్ధి జరుగుతుందా అని…?

కచ్చితంగా జరుగుతుంది, ఒక మనిషికి జీవితాంతం ఉండే మత్తు దేవుడు, మతం.

మన జీవితంలో ఎక్కువ సమయం దీనికే వృధా అవుతుంది. మనిషి ఎక్కువ సమయాన్ని దేవుడికి, పూజలకు, వ్రతాలకు తీర్థయాత్రలకు తిరగడానికి సమయాన్ని వెచ్చిస్తున్నాడు. ఆ సమయాన్ని తన అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటే ఎవరి ముందు చేయి చాచాల్సిన అవసరం లేదు. ఎవరిని బేధిరించాల్సిన అవసరం లేదు. ఎవరికి వారే స్వయం పోషకులు అవుతారు.

ఎప్పుడైతే మనిషి…
దేవుడు, మతం నుంచి బయటికి వస్తాడో..!
ప్రశ్నించడం నేర్చుకుంటాడో..!
తార్కికంగా ఆలోచించడం మొదలు పెడతాడో..!
ఎక్కువ సమయం తన అభివృద్ధి మీద, తన మీద జరుగుతున్న ఆర్ధిక, సామాజిక, రాజకీయ దోపిడీ మీద
దృష్టి పెడతాడో..!
అప్పుడు.. అన్నిటికి తానే సమాధానం కనుక్కొంటాడు..!
అన్ని విధాల అభివృద్ధి చెందుతాడు..!
దోపిడీ, మోసం లేని సమాజం నిర్మించుకుంటాడు..!!
: అడియాల శంకర్
సేకరణ : వనం మహేందర్
భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment