మహా శివరాత్రి శభాకాంక్షలు – దైవారాధనలో దీన్ని ఓ దీక్షలా పాటిస్తారంతా!

Get real time updates directly on you device, subscribe now.

దైవారాధనలో దీన్ని ఓ దీక్షలా పాటిస్తారంతా!

ఉపవాసంలోనూ ఎన్నో రకాలు !

మహా శివరాత్రి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉపవాసం. దైవారాధనలో దీన్ని ఓ దీక్షలా పాటిస్తారంతా! అయితే ఉపవాసం పేరుతో కేవలం దైవాన్ని ఆరాధించడమే కాదు.. దాని అంతర్లీన పరమార్థం ఆరోగ్యమనే చెప్పాలి. ఉపవాసం పేరుతో కడుపు మాడ్చుకోవడం కాకుండా ఆరోగ్యంగా ఆ దీక్షను పాటిస్తే.. దానివల్ల చేకూరే ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఉపవాస దీక్షలో చాలా రకాలున్నాయన్న సంగతి మనకు తెలిసినా.. ఎలా ఉపవాసం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయనే విషయం తెలిసింది మాత్రం కొందరికే అని చెప్పుకోవచ్చు! మరి, ఇంతకీ ఈ ఉపవాస దీక్షను ఎలా ఆచరించాలి? దానివల్ల కలిగే ప్రయోజనాలేంటి తెలుసుకుందాం రండి..

ఉపవాస దీక్షలో ఉన్నవారు, బరువు తగ్గాలనుకునే వారిలో కొందరు తిండీ తిప్పలు మానేసి మరీ ఉపవాసం ఉంటుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ప్రయోజనాలేమో గానీ ఆరోగ్యానికి నష్టమే ఎక్కువ జరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి ఉపవాసం చేసే విధానాల గురించి తెలుసుకుని ఆ నియమాలను పాటిస్తే సరైన ఫలితాలు పొందచ్చు.

నిర్జల ఉపవాసం..

కనీసం నీరు కూడా తాగకుండా చేసే ఉపవాసాన్ని ‘నిర్జల ఉపవాసం’ అంటారు. ఆహారం లేకుండా అయినా ఉండచ్చు.. కానీ నీరు తాగకుండా ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదనేది నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే రోజంతా నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్‌ బారిన పడే అవకాశాలే ఎక్కువ. అలాగే ఆహారం తీసుకోకపోవడం వల్ల పెరిగే శరీర ఉష్ణోగ్రతను నీళ్లు అదుపుచేస్తాయి. కాబట్టి మీరు ఉపవాసం రోజు ఆహారమేమీ తీసుకోకపోయినా నీరు తాగడం మాత్రం మానద్దు. వీలైతే ఇటువంటి ఉపవాసాన్ని పాటించకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

జలోపవాసం..

ఘనాహారం తీసుకోకుండా కేవలం నీటిని మాత్రమే తాగుతూ చేసే ఉపవాసాన్ని ‘జలోపవాసం’ అంటారు. ఊబకాయంతో బాధపడేవారికి తరచూ ఇలా చేయడం వల్ల చాలా ప్రయోజనం చేకూరుతుందంటున్నారు నిపుణులు. కానీ కేవలం నీళ్లను మాత్రమే తీసుకునేటప్పుడు కాస్త గోరువెచ్చని నీటిని తీసుకోవడం మంచిది. అంతేకాదు.. మీరు తీసుకునే నీటిలో కాస్త నిమ్మకాయ రసం, తేనె కలుపుకొని తాగితే మరిన్ని ప్రయోజనాలు చేకూరతాయి. నిమ్మరసం వల్ల శరీరంలో పేరుకున్న కొవ్వు కరగడంతోపాటు.. శరీరం నీరసించకుండా తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థ పనితీరు కూడా మెరుగవుతుంది. ఇలా మీరు ఉపవాసం పాటిస్తున్న రోజులో 8 నుండి 10 సార్లు ఈ మిశ్రమాన్ని తాగితే మీరు ఇతర ఆహారమేమీ తీసుకోకపోయినా ఎలాంటి సమస్యలూ ఎదురుకావు. అంతేకాదు.. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థకు విశ్రాంతి లభించడంతోపాటు.. శరీరంలోని వ్యర్థాలూ బయటికి వెళ్లిపోతాయి.

పండ్ల రసాలు మాత్రమే తీసుకుంటూ..

ఘనాహారం లేకుండా.. పండ్ల రసాలను మాత్రమే తాగుతూ కూడా ఉపవాస దీక్షను పాటించవచ్చు. ముఖ్యంగా పుచ్చకాయ, యాపిల్‌, తర్బుజా, నారింజ.. వంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్లను నేరుగా లేదంటే రసాల రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అలాగే ఈ ఫ్రూట్‌ జ్యూసులు శరీరంలోని చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచుతాయి. తద్వారా రోజంతా అలసట దరిచేరకుండా ఉండడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉండచ్చు.

ఘనాహారంతో ఉపవాసం..

నీరు లేదంటే పండ్లను తీసుకుంటూనే ఉపవాసం చేయాలని నియమమేమీ లేదు. ఈ క్రమంలో సగ్గుబియ్యం, చిలగడదుంప, మొక్కజొన్న, గోధుమపిండి.. వంటి పదార్థాలతో విభిన్న వంటకాల్ని చేసి స్వామికి నివేదిస్తాం. వీటినే ప్రసాదంగా స్వీకరిస్తూ ఉపవాస దీక్ష చేయచ్చు. దీన్నే ‘ఘనాహారంతో చేసే ఉపవాసం’గా పిలుస్తాం. ఇలా మనం తీసుకునే వివిధ పదార్థాల్లోని పోషకాల వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఫలితంగా అలసటా దరిచేరదు.

ఇవి గుర్తుంచుకోండి..!

* ‘ఉపవాసం కదా.. పూర్తిగా ఏమీ తినకూడదు..’ అని ముందు రోజే ఎక్కువగా తినేయడం మంచిది కాదు. తద్వారా జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది.

* అలాగే ఉపవాస దీక్ష చేసే రోజు మధ్యమధ్యలో తీసుకునే పాలు, పండ్లు వంటి అల్పాహారం మరీ ఎక్కువగా కాకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే. ఎందుకంటే అలా తీసుకోవడం వల్ల అజీర్తి, బరువు పెరగడం.. వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది.

* ముఖ్యంగా ఉపవాస దీక్ష ముందు రోజున కారంగా ఉండే ఆహార పదార్థాల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం. ఎందుకంటే వీటివల్ల కడుపులో ఎసిడిటీ స్థాయులు పెరిగి.. తద్వారా కడుపులో తిప్పడం, మంట, అజీర్తి, విరేచనాలు.. వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఉపవాసం చేయడానికి శరీరం సహకరించదు.

* మధుమేహం, బీపీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు, గర్భవతులు ఉపవాస దీక్షను చేయకపోవటమే మేలు.

చూశారుగా.. ఉపవాస ప్రక్రియను సరైన పద్ధతిలో పాటిస్తే ఎన్ని ప్రయోజనాలు చేకూరుతాయో.. ఈ ఉపవాస దీక్ష వల్ల అటు స్వామి కార్యం.. ఇటు స్వకార్యం కూడా నెరవేరుతుంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment