బ్లాక్ మెయిల్ తో మోసానికి పాల్పడడంతో కేసు నమోదు
బాదితులు ఎవరైనా ఉంటే పోలీసులకు పిర్యాదు చేయాలి- వేములవాడ సిఐ
హ్యూమన్ రైట్స్ టుడే/రాజన్న సిరిసిల్ల జిల్లా/క్రైం/డిసెంబర్ 06:
ఓ మహిళా హోంగార్డు “కి”లాడిగా మారింది. బ్లాక్ మెయిల్ తో మోసం చేసింది. వేములవాడ టెంపుల్ రిటైర్డ్ ఉద్యోగి ఆమె వలలో పడి మోసపోయాడు. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో కిలాడి హోంగార్డును అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహిళా హోంగార్డు అనూష రూటే సపరేటు అన్నట్లుగా ఉంది. వేములవాడకు వచ్చే భక్తులకు రక్షణగా నిలువాల్సిన హోంగార్డు బ్లాక్ మెయిల్ తో మోసాలకు తెరలేపింది. తన భర్త ఆరోగ్యం సరిగా లేదని డబ్బున్న వాళ్ళను వలలో వేసి అందినంత దోచుకునే పనిలో నిమగ్నమయ్యింది. చివరకు వేములవాడ టెంపుల్ రిటైర్డ్ ఉద్యోగి ద్వారకా శేఖర్ మాయ లేడి హోంగార్డు వలలో పడ్డాడు. తన భర్త ఆరోగ్యం బాగాలేదని శేఖర్ వద్ద 3 లక్షల 50 వేల రూపాయలు అప్పుగా తీసుకుంది మహిళా హోంగార్డు. ఆరు నెలల్లో తిరిగి ఇస్తానని చేప్పిన ఆ మాయ లేడిని అప్పు డబ్బులు అడిగితే బ్లాక్ మేయిల్ కు పాల్పడింది.
శేఖర్ ఫోటోను మార్ఫింగ్ చేసి పెళ్లి పత్రిక తయారు చేసి అతను తనను పెళ్లి చేసుకున్నాడని అసత్య ప్రచారంతో బ్లాక్ మెయిల్ చేస్తూ ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఫోటోలను పెళ్లి పత్రికను బయటపెడుతానని బెదిరించింది. ఆ పోటోలు బయటకు వస్తే పరువు పోతుందని భయపడిన శేఖర్ ఐదు లక్షల రూపాయలు మాయలేడి హోంగార్డుకు ముట్టజెప్పాడు. ఇలా అవసరం ఉన్నప్పుడల్లా డబ్బులు డిమాండ్ చేసి అందినకాడికి దండుకునే పనిలో నిమగ్నమైంది. తాజాగా మరో రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరించింది. విసిగిపోయిన శేఖర్ వేములవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మహిళా హోంగార్డు అనూషను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గతంలో వేములవాడ కు చెందిన వ్యక్తి వద్ద 40 లక్షలు తీసుకుని మోసం చేయడంతో అప్పట్లో కేసు నమోదు అయిందని వేములవాడ సిఐ వీర ప్రసాద్ తెలిపారు. మహిళా హోంగార్డు బ్లాక్ మెయిల్ తో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని సిఐ కోరారు.