హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/లీగల్/అక్టోబర్ 25: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా కుంచం మహేశ్వరరావు, టీసీ ధనశేఖర్, చల్లా గుణరంజన్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. వీరి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ హైకోర్టులో న్యాయవాదులుగా ఉన్న కుంచం మహేశ్వరరావు, టి. చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్‌లను ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని ఈ నెల 15న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 26 మంది ఉన్నారు. ఈ ముగ్గురు నియామకంతో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జి.నరేందర్‌ను ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫార్సు చేసింది.