GO 29, GO 55 మధ్య తేడా ఏంటి : గ్రూప్ 1 అభ్యర్థులు ఎందుకు రోడ్లెక్కుతున్నారు..?
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 అభ్యర్థులు అయోమయం పరిస్థితిలో ఉన్నారు. పేపర్ లీకులు, పరీక్ష రద్దులు కారణంగా 2022లో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇంకా ముందుకు కదలడం లేదు. దాదాపు ఇప్పటి వరకు నాల్గైదు సార్లు గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేశారు. దీంతో చాలామంది అభ్యర్థుల్లో నిరాశే మిగిలింది. తాజాగా గ్రూప్ 1 ఉద్యోగాల నియామకంలో జీవో 29 రద్దు చేయాలని అభ్యర్థులు రోడ్డెక్కుతున్నారు. హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన 55 జీవో రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 29 తీసుకువచ్చింది. జీవో 55తో పోల్చుకుంటే జీవో 29 వల్ల రిజర్వుడ్ వర్గాలకు చాలా ఆన్యాయం జరుగుతుందంటున్నారు అభ్యర్థులు. అసలు ఏంటీ జీవో 29 అనేది ఇప్పుడు చూద్దాం.
మెయిన్స్ షెడ్యూల్ ప్రకటించాక కోర్టు కేసులు
అక్టోబర్ 21నుంచి 27 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. జీవో 29 కారణంగా రిజర్వేషన్ అమలు కావడం లేదని గ్రూప్ 1 అభ్యర్థులు పదుల సంఖ్యలో హైకోర్టులో కేసులు వేశారు. అక్టోబర్ 21న ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు జీవో 29 రద్దు కేసును విచారించబోతోంది.
నిరుద్యోగులు డిమాండులో న్యాయం ఉంది. కాబట్టి జీవో 29ని రద్దు చేసి పరీక్షలను రీ సెడ్యూల్ చేయాలని సుప్రీంకోర్టు చెబుతుందా? లేకపోతే పరీక్షలు మొదలైన తర్వాత రద్దు చేయటం సాధ్యంకాదు కాబట్టి జీవో 29 ప్రకారమే పరీక్షలు రాయాలని చెబుతుందా అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే కొన్ని పిటిషన్లు హైకోర్టు కొట్టివేసింది. గ్రూప్ 1 నియామకాల్లో 1: 50 ప్రతిపదికన ప్రిలీమ్స్ రాసిన వారి నుంచి మెయిన్స్ కు సెలక్ట్ చేశారు. అంటే ఒక పోస్ట్ కు 50 మంది అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లో ఉన్న 563 పోస్టులకు 28వేల 150 మంది మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేశారు.
జీవో 55 గురించి
GO 55 ప్రకారం 1 జాబ్ కి రిజర్వేషన్ సహా అన్ని కేటగిరీల నుంచి 50 మందిని సెలక్ట్ చేస్తారు. మిగతా రిజర్వుడ్ పోస్టులకు ఆయా అభ్యర్థులనే ఎంచుకుంటారు. జీవో 55 ప్రకారం.. రిజర్వుడ్ అభ్యర్థులకు వారి కోటా, ఓపెన్లోనూ ఛాన్సుంటుంది. జీవో 55లో మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన అభ్యర్థుల్లో రిజర్వుడు క్యాటగిరి అభ్యర్థులకు 50 శాతం, మిగిలిన అగ్రవర్ణాలకు 50 శాతం చొప్పున క్లియర్ గా విభజించారు. ఇందులోనే ఎవరైనా రిజర్వుడు క్యాటగిరిలోని అభ్యర్థి అత్యత్తుమ ర్యాంకు సాధిస్తే అతడిని ఓసీ క్యాటగిరిలో ఎంపికచేస్తారు. దీనివల్ల రిజర్వుడు క్యాటగిరి అభ్యర్థులకు పోటీ తగ్గి మెయిన్స్ పరీక్షలు రాసే అవకాశాలు మరింతగా పెరుగుతాయి. ఓపెన్ క్యాటగిరిలో పరీక్షలు రాసే అభ్యర్థులు దేశంలో ఏ రాష్ట్రం వారైనా అయ్యుండచ్చు. రిజర్వుడు క్యాటగిరిలో పరీక్షలు రాసేవారు మాత్రం వందశాతం లోకలే అయ్యుండాలని జీవోలో ఉంది.
జీవో 29 గురించి
GO 29 ప్రకారం ఓపెన్లో రిజర్వుడ్ అభ్యర్థులకు ఛాన్సుండదు. టాప్ మార్కులు వచ్చినా రిజర్వేషన్లోనే పరిగణించడంతో మరో రిజర్వుడ్ అభ్యర్థికి ఛాన్స్ ఉండదు. దీంతో GO 29 రద్దు చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఆ జీవో 29 ప్రకారం రిజర్వేషన్ క్యాటగిరి అన్నదాన్ని తీసేశారు. 1:50 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్ష రాయబోయే అభ్యర్థుల్లో 100 పోస్టులకు 5 వేలమందికి పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తున్నారు. సాధారణంగా 5 వేల మందిలో 2500 మంది రిజర్వుడు క్యాటగిరిల్లో, మిగిలిన 2500 మంది ఓపెన్ క్యాటగిరిలో ఉండాలి. కానీ జీవో 29 ప్రకారం మొత్తం 5 వేలమంది ఓపెన్ క్యాటగిరిలోనే మెయిన్స్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. తెలంగాన ప్రభుత్వం ఇప్పుడు ఓపెన్ క్యాటగిరీలో పరీక్షలు నిర్వహించి.. ఉద్యోగాల ఎంపికలో రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్తోంది. దీన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు.
బీసీ, ఎస్టీ, ఎస్సీలకు రిజర్వేషన్ లేదా?
జీవో 29 ప్రకారం ఓసీ క్యాటగిరిలోని అభ్యర్థులకే ఎక్కువ లాభం జరుగుతుంది. భర్తీ చేయాల్సిన పోస్టులు 563 ప్రకారం మెయిన్స్ పరీక్షలకు 28,160 మందికి అవకాశం రావాల్సుండగా 31వేల 383 మందికి అవకాశం వచ్చింది. అంటే సుమారు 5 వేలమందికి పైగా ఓసీ క్యాటగిరి అభ్యర్థులకు లబ్ధి జరుగుతోందని ఆందోళనకారుల వాదన. ఓసీ క్యాటగిరి అభ్యర్థుల్లో 5 వేలమందికి పైగా లబ్ది జరుగుతోందంటే ఆ మేరకు రిజర్వుడు క్యాటగిరిల్లోని అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నట్లే అని ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. తమకు అన్యాయం జరుగుతోందని జీవో 29ని రద్దుచేసి పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రాయబోయే అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు.