భారత్లో 23.4 కోట్ల పేదలు.. ప్రపంచంలోనే అత్యధికం.. అన్ని దేశాల్లో కలిపి పేదలు 110 కోట్లు..
ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడి..
హ్యూమన్ రైట్స్ టుడే హైదరాబాద్ అక్టోబర్ 19: ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల మందికిపైగా ప్రజలు ఇంకా తీవ్రమైన పేదరికంలోనే జీవిస్తున్నారని ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన ‘గ్లోబల్ మల్టీడైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్-2024’ నివేదికలో వెల్లడించింది. 23.4 కోట్ల మందితో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత పాకిస్థాన్, ఇథియోపియా, నైజీరియా దేశాలు ఉన్నాయి. మొత్తం పేదల్లో సగానికి పైగా (58.4 కోట్లు) 18 ఏళ్ల లోపు చిన్నారులు ఉండటం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదల్లో 83.2% మంది ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లోనే ఉన్నారని నివేదిక గుర్తించింది. మొత్తం పేదల్లో 83.7%మంది గ్రామాల్లోనే ఉన్నారని నివేదిక చెప్పింది. ఇళ్లు, పారిశుధ్యం, విద్యుత్తు, వంట గ్యాస్, పోషకాహారం లేమి తదితర అంశాలపై 2012-23 మధ్య అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా ఐరాసకు చెందిన యూఎన్డీపీ మరో సంస్థ ఓపీహెచ్ఐతో కలిసి ఈ నివేదికను రూపొందించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 2023లో అధికంగా దేశాల్లో అంతర్గత ఘర్షణలు, పలు దేశాల మధ్య యుద్ధాలు నెలకొన్నాయని, దీని వలన 11.7 కోట్ల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోవాల్సి వచ్చిందని నివేదిక తెలిపింది. మొత్తం 110 కోట్ల మంది పేదల్లో ఘర్షణలు, యుద్ధాలు, అశాంతియుత పరిస్థితులు నెలకొన్న రీజియన్లలో 40 శాతం(45.5 కోట్లు) ఉన్నారని వెల్లడించింది.