ఒడిశా మంత్రిపై కాల్పులు.. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలింపు

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/భువనేశ్వర్‌: ఒడిశాలో ఓ మంత్రిపై కాల్పుల ఘటన కలకలం రేపింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి నబకిశోర్‌ దాస్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మంత్రికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో వెంటనే ఆయన్ను సమీప ఆసుపత్రికి తరలించారు. మంత్రి ఛాతీలోకి బుల్లెట్‌ దూసుకెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.

ఝార్సుగూడ జిల్లా బ్రిజరాజ్‌ నగర్‌లోని గాంధీ చౌక్‌ వద్దకు చేరుకున్న నబకిశోర్‌.. వాహనం దిగుతున్న సమయంలో దుండగుడు కాల్పులు జరిపాడు. అయితే, దాడికి కారణమేంటనే విషయం తెలియరాలేదు. దాడి విషయం తెలియగానే బీజేడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోపాలచంద్ర దాస్ అనే ఏఎస్సై సర్వీస్ రివాల్వర్‌తో మంత్రిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం మంత్రిని హైదరాబాద్ తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.

బిజూ జనతాదళ్‌లో సీనియర్‌ నేత అయిన నబకిశోర్‌ దాస్‌.. మహారాష్ట్రలోని శని శింగణాపుర్‌ దేవాలయానికి రూ.కోటికిపైగా విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు విరాళం ఇచ్చి ఇటీవల వార్తల్లో నిలిచారు. అయితే, 2024 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. మంత్రిపై దాడులు జరగడం అటు పార్టీలోనూ తీవ్ర చర్చనీయాంశమయ్యింది. అయితే, ఒడిశాలో ఎన్నికల సమయంలో ఇటువంటి హింసాత్మక ఘటనలు తరచూ జరుగుతుంటాయని.. ఇవి ఆందోళన కలిగించే విషయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు మొదలుపెట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment