ఉదయపు వేళ, ప్రకృతి, వెలుగుల పూల బుట్టను నెత్తి నెత్తుకొని అడవి నుండి అడుగేసి నగరంలోకి ప్రవేశిస్తుంది.
మధ్యాహ్నానికి, రంగులలో సింగారించుకొని, గౌరమ్మగా మారుతుంది – గౌరవించబడే దైవ స్వరూపం.
సాయంత్రానికి, చప్పట్ల జాతరలో, పాటల పూజల్లో, ప్రకృతి బతుకమ్మగా మారి, ప్రజల జీవన నాట్యంలో భాగమవుతుంది. ఉత్సవంలో ఉన్న ప్రాణశక్తి, ఆహ్లాదం, ఆనందం ప్రకృతితో మమేకమవుతాయి.
రాత్రి పడగానిచ్చిన వేళ, వీడ్కోలుల చీకటిని తీసుకొని ప్రకృతి చల్లని చెరువు ఒడిలోకి చప్పున ఒదిగి పోతుంది. ఆ ప్రశాంతమైన నిశ్శబ్దంలో, ప్రకృతి తన పూర్వావస్థకు చేరుకుంటుంది, ఆమె తన మూలాలకు తిరిగి వెళుతుంది.
పూల సంబరం పండుగ..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 08: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక. బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ. ఇదో పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. తొమ్మిది రోజుల పాటు ఆడి పాడి గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబురం బతుకమ్మ పండుగ. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు.
ప్రపంచంలోనే అద్భుతమైన పండుగ..
తెలంగాణ ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు తెలిపేలా బతుకమ్మ పాటలను పాడతారు. బతుకమ్మ పాటలలో పురాణ, ఇతిహాస కథలు మొదలుకొని తెలంగాణ వీరుల కథలు, జానపద ఇతివృత్తాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా బతుకమ్మ పాటల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిస్తుంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ పాడే పాటలు మొదలుకొని ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయె చందమామ, కోసలాదేశుండు నుండి ఉయ్యాలో దశరథ రాముండు ఉయ్యాలో, చిత్తూ చిత్తుల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ అంటూ పాటలు మహిళల నోటి నుంచి జాలువారుతాయి. ఇంత చక్కని, అందరూ సమష్టిగా జరుపుకునే అందమైన, అద్భుతమైన పండుగ ప్రపంచంలోనే బతుకమ్మ ఒక్కటే అని చెప్పటం తెలంగాణాకే గర్వకారణం.
వ్యాస కర్త : దూపాటి హరిప్రసాద్, సామాజిక విశ్లేషకుడు