హ్యూమన్ రైట్స్ టుడే/న్యూదిల్లీ: పరీక్షలు సమీపిస్తోన్న తరుణంలో విద్యార్థుల్లో ఒత్తిడిని తొలగించేందుకు ప్రధాని మోదీ(Modi) శుక్రవారం విద్యార్థులతో సంభాషించారు. వారు అడిగిన ఎన్నో ప్రశ్నలకు పరీక్షా పే చర్చ(ParikshaPeCharcha2023)లో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన విద్యార్థిని అక్షర.. మోదీని ప్రశ్నించింది. బహు భాషలపై పట్టు సాధించేందుకు ఎలాంటి కృషి చేయాలని అడిగింది.
దీనిపై మోదీ బదులిస్తూ ఒక ఉదాహరణను వివరించారు. ‘కార్మికులు నివసించే బస్తీలోని ఒక ఎనిమిదేళ్ల చిన్నారి.. మలయాళం, మరాఠీ, హిందీ, బెంగాలీ, తమిళం మాట్లాడటం నన్ను ఆశ్చర్యపర్చింది. అసలు ఆ బాలికకు అన్ని భాషలు మాట్లాడటం ఎలా సాధ్యమైందని ఆరా తీశాను. ఆ చిన్నారి ఇంటి పక్కన నివసించే వ్యక్తులు ఒక్కో రాష్ట్రానికి చెందినవారు. ఎక్కడి నుంచో బతికేందుకు వచ్చిన వారంతా ఒక దగ్గర నివసించడంతో ఆ బాలిక వారితో నిత్యం మాట్లాడుతుండేది. ఆ క్రమంలోనే ఆమెకు అన్ని భాషలు వచ్చాయి. ఆ చొరవ మెచ్చుకోదగినది. ఇతర భాషలు నేర్చుకోవడానికి ప్రత్యేక అర్హతలు ఉండాల్సిన అవసరం లేదు. నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు’ అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. ఇక ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమం కోసం 38 లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అడిగిన సందేహాలను మోదీ నివృత్తి చేశారు.