రైతు భరోసాపై సర్కార్ కీలక ప్రకటన..!!
హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/ సెప్టెంబర్ 13: రెండు లక్షల రుణమాఫీ పేరుతో హడావిడి చేసి రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని బీఆర్ఎస్ పదే పదే విమర్శలు చేస్తోంది. రైతు భరోసాను ఎప్పటి నుంచి అమలు చేస్తారు?
ఎవరికి రైతు భరోసా ద్వారా ఆర్థిక సాయం చేయనున్నారు? అనే అంశాలపై స్పష్టత ఇవ్వకుండా సర్కార్ కాలయాపన చేస్తోందని ఫైర్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పంటలు పండించే రైతులకే రైతు భరోసా ద్వారా ఆర్థిక సాయం చేయనున్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మాదిరి కొండలకు, గుట్టలకు రైతు భరోసా ఇచ్చేది లేదని కుండ బద్దలు కొట్టారు. అయితే, ఎప్పటి నుంచి ఇస్తారు అనే దానిపై క్లారిటీ ఇవ్వకపోయినా దసరా తర్వాత అంటే వచ్చే నెలాఖరులోపు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.
ఈసారి ఐదు ఎకరాలకా లేక పది ఎకరాలు ఉన్న వారికి ఈ రైతు భరోసాను వర్తింపజేయాలా? అనే విషయంలో ప్రభుత్వం ఎటు తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. పేద రైతుకు మేలు చేయాలనే సర్కార్ భావిస్తుండటంతో ఐదు ఎకరాలకు రైతు భరోసాను వర్తింపజేయాలి అని తుది నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
ఇప్పటి వరకూ ఉన్న లెక్కల ప్రకారం మొత్తం 1.52 కోట్ల ఎకరాలకు రూ.22,800 కోట్లు అవుతుంది. అదే 5 ఎకరాలకే రైతు భరోసాను పరిమితం చేస్తే, అప్పుడు 62.34 లక్షల మంది రైతులకు ఈ సాయం అందుతుంది. రైతుల సంఖ్య తక్కువ అయినా ప్రతీ పేద రైతుకు గత ప్రభుత్వం కంటే అదనంగా 5000 ఎక్కువ ఇచ్చినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.