జిల్లాల్లో హైడ్రా తరహా వ్యవస్థ… చెరువులు, కుంటల ఆక్రమణల లిస్ట్ తీయండి..
కబ్జాలకు పాల్పడింది ఎంతటి వాళ్లైనా వదిలి పెట్టవద్దని..
ప్రకృతి మీద మనం దాడి చేస్తే అది మన మీద దాడి చేస్తదని హెచ్చరించారు..
కలెక్టర్లను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/03 సెప్టెంబర్: జిల్లాల్లో కూడా చెరువులు, కుంటలు కబ్జాలపై నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా తరహా వ్యవస్థలను జిల్లాల్లో ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పారు. కబ్జాలకు పాల్పడింది ఎంతటి వాళ్లైనా వదిలిపెట్టవద్దని సూచించారు. కోర్టుల నుంచి అనుమతులు తీసుకుని ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో కాలువలను కూడా వదల్లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమణలపై ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించానన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
పదేళ్లలో కేసీఆర్ ఒక్కనాడు పరామర్శించలేదు
మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో మంత్రులతో కలిసి అధికారులతో వరదలపై రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు వరదలు వస్తే ఏనాడు బాధితులను పరామర్శించలేదని విమర్శించారు. మాసాయిపేటలో చిన్నారులు చనిపోతే కూడా పరామర్శించలేదని మండిపడ్డారు. అమెరికాలో ఉండి కూడా కేటీఆర్ మంత్రులపై విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారులు, మంత్రులు నాలుగు రోజులుగా వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని చెప్పా కష్టాల్లో ఉన్న ప్రజలను స్వచ్చంధ సంస్థలు ఆదుకోవాలని సూచించారు.
కబ్జా చేసిన వాళ్లను వదలకండి
వరదలకు ప్రాణ నష్టం తనను కలచివేసిందన్నారు రేవంత్ రెడ్డి. చెరువులు కబ్జాలు చేయడం దారుణమైన నేరమన్నారు. ప్రకృతి మీద మనం దాడి చేస్తే అది మన మీద దాడి చేస్తదని హెచ్చరించారు. చెరువులు, కుంటలు కబ్జాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆక్రమణలకు సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు రేవంత్. ఆక్రమణలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనన్నారు. అందుకే ఎంత ఒత్తిడి వచ్చినా హైడ్రా వెనక్కి తగ్గకుండా పని చేస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.