మహిళా ఉద్యోగిపై ఆరేళ్లుగా వేధింపులు

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతీ: పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) కార్యాలయంలో మహిళా ఉద్యోగులపై వేధింపుల పర్వం శ్రుతిమించింది. ఓ మహిళా ఉద్యోగిపై ఓ విభాగం హెడ్‌ గత ఆరేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నా… పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. బాధితురాలు.. కార్యాలయంలోని ఇంటర్నల్‌ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌, జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని మహిళా ప్రొటెక్షన్‌ సెల్‌, చివరకు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఆ అధికారి ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. విధి నిర్వహణలో భర్త చనిపోవడంతో కారుణ్య నియామకం ద్వారా ఆ మహిళ పన్నెండేళ్ల క్రితం పంచాయతీరాజ్‌ శాఖలో ఉద్యోగంలో చేరారు. ఆరేళ్ల నుంచి ఆ మహిళా ఉద్యోగినిపై ఈఎన్‌సీలోని ఓ విభాగం హెడ్‌ నిత్యం లైంగిక వేధింపులకు పాల్పడుతూ మానసిక క్షోభకు గురిచేస్తున్నాడు. దీంతో ఓ దశలో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో మహిళా ఉద్యోగి కూడా విజయవాడకు వచ్చారు.

నలుగురైదుగురు ఉద్యోగినులతో కలిసి ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవారు. అయితే ఆమెను టార్గెట్‌ చేసిన సదరు అధికారి.. తనతో చనువుగా ఉండాలని, శారీరక సంబంధం పెట్టుకోవాలని ప్రతిరోజూ వేధించేవాడు. కార్యాలయంలో కూడా డోర్‌కు అడ్డుగా నిలబడి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు.. ‘నీకు భర్త లేడు కాబట్టి ఇక నుంచి నాతోనే ఉండాలి.. మిగతా ఉద్యోగినులతో కలిసి ఉండొద్దు. విడిగా గది అద్దెకు తీసుకో…’ అని ఒత్తిడి చేసేవాడు. ఒకవేళ ఆమె ఎదురుతిరిగితే.. తనకు ఉన్నతాధికారుల మద్దతు ఉందని, తనను ఏమీ చేయలేవని బెదిరించేవాడు. ఈ వేధింపులు భరించలేక ఆ ఉద్యోగిని ఈఎన్‌సీ కార్యాలయంలో ఉన్న ఇంటర్నల్‌ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌కు సైతం ఫిర్యాదు చేశారు. కానీ, ఈ కమిటీ బాధితురాలికి బాసటగా నిలవకపోగా ఆమెపైనే విచారణ జరిపి.. నిందితుడికి మద్దతు పలకడంతో ఆమె మరింత కుంగిపోయింది. బాధిత మహిళను జిల్లాలకు పంపించాలని ఆ కమిటీ సిఫారసు చేయడం విమర్శలకు దారితీసింది.

యాసిడ్‌ పోస్తానని బెదిరింపు..

దీంతో ఆ అధికారి వేధింపులు అధికమయ్యాయి. ఓసారి ఆ మహిళా ఉద్యోగి బెంజ్‌ సర్కిల్‌ దగ్గర బస్సు దిగి కార్యాలయానికి వచ్చే సమయంలో ఆ అధికారి తనకు లొంగకుంటే యాసిడ్‌ పోస్తామని వెంటాడి బెదిరించాడు. దీంతో ఆ మహిళా ఉద్యోగి తన కుమారుడు, సోదరుడి సహకారంతో జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని మహిళా ప్రొటెక్షన్‌ సెల్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాలతో విచారణ జరిపిన అధికారులు సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసినా పంచాయతీరాజ్‌ ఈఎన్‌సీ అధికారులు బుట్టదాఖలు చేశారు. తర్వాత ఆ అధికారి తనకున్న పలుకుబడితో ఆమెను వేరే సెక్షన్‌కు మార్పించి రోడ్డుమీద నిలబెడతామని బెదిరించారు. ఆయన ఆగడాలు భరించలేక ఆమె జాతీయ మహిళా కమిషన్‌ను సైతం ఆశ్రయించారు. ఆ కమిషన్‌ ఆదేశాలతో సూర్యారావుపేట పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆ అధికారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే అధికారులు ఆయనకు అండగా నిలబడుతున్నారని, పదోన్నతి కల్పించేందు కు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తప్పు చేసిన అధికారికి మాత్రం పదోన్నతి కట్టబెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారని బాధిత మహిళ వాపోయారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment