సోమవారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు?
తెలంగాణ వ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు..
కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..
సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/01 సెప్టెంబర్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. సెప్టెంబర్ 2 సోమవారం నాడు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తొలుత హైదరాబాద్ నగరంలోని విద్యా సంస్థలకే సెలవు ప్రకటించింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితిని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది.
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు, వానలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కనీసం కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అలెర్ట్ అయ్యారు. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష..
రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తది తరులతో ఫోన్లో రివ్యూ చేసి అప్రమత్తం చేశారు. సీఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్, పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలి కాన్ఫరెన్స్ లో ఆదేశించారు.