హ్యూమన్ రైట్స్ టుడే/జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులను భరించలేకే పదవికి రాజీనామా చేస్తున్నట్టు మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రావణి ప్రకటించారు. ఎమ్మెల్యే అడుగడుగునా వేధింపులకు గురిచేశారంటూ ఆమె ఆరోపించారు. పైగా, డబ్బులు ఇవ్వాలంటూ తనను డిమాండ్ చేశారని ఆమె బోరున విలపిస్తూ చెప్పారు. మీకు పిల్లలు ఉన్నారు, వ్యాపారాలు ఉన్నాయి, జాగ్రత్త’ అని సంజయ్ బెదిరించారని… డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని అన్నారు. ఒక బీసీ బిడ్డనైన తాను ఎదుగుతున్నానని దొర అహంకారంతో తనపై కక్షకట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అభివృద్ధి పనులకు అడ్డుతగిలారని… మున్సిపల్ ఛైర్మన్ పదవి తనకు నరకప్రాయంగా మారేలా చేశారని చెప్పారు. పేరుకే తాను మున్సిపల్ ఛైర్మన్ అయినా పెత్తనం అంతా ఎమ్మెల్యేదే అని దుయ్యబట్టారు.
సంజయ్ కుమార్‌తో తమ ప్రాణాలకు ముప్పు ఉందని అన్నారు. తమ కుటుంబానికి ఏమైనా జరిగితే ఎమ్మెల్యేనే కారణమని అన్నారు. తమకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరుతున్నానని చెప్పారు. తెలంగాణలో అధికార పార్టీ నేతల ఆగడాలకు అడుకట్ట వేయాలని కోరుతున్నారు.