హైకోర్టు కూల గొట్టవద్దు అని చెప్పలేదు..

Get real time updates directly on you device, subscribe now.

కేటీఆర్ ఫామ్ హౌస్.. నేడే కూల్చివేత కూల్చివేత..

హైకోర్టు కూల గొట్టవద్దు అని చెప్పలేదు.. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని చెప్పింది..

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/25 ఆగష్టు: హైదరాబాద్‌లో హైడ్రా రెచ్చిపోతోంది. చెరువుల ఉనికినే దెబ్బతీసేలా నిర్మించిన కట్టడాలను కూల్చేస్తోంది. గత వారం పది రోజులుగా హైడ్రా ధాటికి వందల కొద్దీ భవనాలు కుప్పకూలిపోయాయి.

దాంతో చెరువులను ఆక్రమించి కట్టిన, చెరువుల ఫుల్ ట్యాంక్ పరిధిలో కట్టిన భవనాల యజమానులు వణికిపోతున్నారు. హైడ్రా చిన్నా చితకా భవనాల దగ్గర్నుంచి పెద్ద పెద్ద అపార్టమెంట్ల వరకు దేనినీ వదలడం లేదు. అన్నిటినీ చితమంటల్లోకి నెట్టేస్తోంది. చెరువుల విషయంలో ఆక్రమణ జరిగిందా…

నిబంధనల అతిక్రమణ జరిగిందా.. అయితే కూల్చేయ్.. ఇదీ హైడ్రా వరస. హైదరాబాద్‌లో ఇంతవరకు కనీ వినీ ఎరుగని విధంగా ఎన్నో పెద్ద పెద్ద అపార్టుమెంట్లు హైడ్రా బారిన పడి శిథిలాలుగా మారిపోయాయి.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ మనసులో ఇంకా ఏయే ఆలోచనలు వున్నాయో.. ఇంకా ఏ రేంజ్‌లో కూల్చివేతలు జరగబోతున్నాయో ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున దశాబ్ద కాలానికి పైగా తన ఎన్ కన్వెన్షన్‌ని కాపాడుకుంటూ వస్తున్నారు. మాదాపూర్‌లోని తిమ్మిడికుంట చెరువులో మూడున్నర ఎకరాలు నాగార్జున ఆక్రమించారని, అక్కడ తనకు వున్న స్థలాన్ని అలాగే వుంచి, మూడున్నర ఎకరాల చెరువును పూడ్చి అందులో ఎన్ కన్వెన్షన్ కట్టారనే ఆరోపణలు వున్నాయి.

ఎన్నో ఫిర్యాదులు కూడా వున్నాయి. అయితే నాగార్జున చాలాకాలంగా కోర్టుల ద్వారా, ప్రభుత్వాలను మేనేజ్ చేయడం ద్వారా తన ఎన్ కన్వెన్షన్‌ని కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే శనివారం నాడు ఉరుము లేని పిడుగులాగా ఒక్కసారిగా హైడ్రా దళాలు ఎన్ కన్వెన్షన్ మీద దాడి చేశాయి. నోటీసులూ గట్రా ఏవీ లేకుండానే ఎన్ కన్వెన్షన్‌ని నేలమట్టం చేశాయి.

ఇది చట్టవిరుద్దం అంటూ నాగార్జున ప్రకటన చేశారు. కూల్చివేతలు పూర్తయిన తర్వాత హైకోర్టు కూడా స్టే ఇచ్చి తన పెద్ద మనసును చాటుకుంది. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఎన్ కన్వెన్షన్ మొత్తం నేలమట్టం అయిపోయింది.

ఈ కూల్చివేతల విషయంలో బీఆర్ఎస్ ఎంతమాత్రం స్పందించలేదు.. ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ కూడా కూల్చివేతలను సమర్థిస్తోంది. ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కరెక్టే అని బీజేపీ నాయకుడు రఘునందన్ రావు ప్రకటించారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ప్రభుత్వాలు చేసే పనుల్లో…

అది ఎంత మంచి పని అయినా ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. అయితే ఎన్ కన్వెన్షన్ విషయంలో గానీ, ఇతర కట్టడాల కూల్చివేత విషయంలోగానీ బీజేపీ కూడా ఎలాంటి విమర్శలు చేయడం లేదు. అంటే అర్థం ఏమిటి.. ఈ కూల్చివేతలకు మద్దతు అభిస్తోంది.

కూల్చివేతలు ముందుముందు మరింత ముమ్మరంగా జరగబోతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కిన అన్ని భవనాలను కూల్చేయాలన్న అభిప్రాయం మెజారిటీ ప్రజల నుంచి వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు కేటీఆర్ ఫామ్‌హౌస్‌ని కూల్చేస్తారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్‌లోని జంట జాలాశయాల పరిధిలో 111 జీవో అమలులో వుంది.

అంటే ఈ ప్రాంతంలో భారీ కట్టడాలు కట్టకూడదు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో ఫామ్ హౌస్‌లు వెలిశాయి. ఈ ప్రాంతంలోనే వెలిసిన కేటీఆర్ ఫామ్‌హౌస్‌తో ఇక్కడ కూల్చివేతలను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఫామ్‌హౌస్‌ వీడియోలను డ్రోన్ ద్వారా చిత్రీకరించిన నేరం మీద రేవంత్ రెడ్డిని కేసీఆర్ ప్రభుత్వం జైలుకు కూడా పంపింది.

ఆనాడు జరిగిన దానికి ఈనాడు రేవంత్ రెడ్డి ప్రతీకారం తీర్చుకుంటున్నారు అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే, కూల్చివేతల పర్వం కేటీఆర్ ఫామ్‌హౌస్‌తో ప్రారంభం కాలేదు.. ఆ ఒక్కదానితో ముగిసేదీ కాదు.. ఏది ఏమైనప్పటికీ ఈ ఆదివారం నాడు కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చేస్తారనే అనుమానాలు అయితే బలంగా వున్నాయి.

ఆ ఫామ్ హౌస్ నాది కాదు.. నా ఫ్రెండ్‌ది.. నేను కేవలం లీజుకు మాత్రమే తీసుకున్నానని కేటీఆర్ ప్రకటించారు. అందులో ఏవైనా అతిక్రమణలు వుంటే నేనే దగ్గరుండి కూలగొట్టిస్తాను అని కూడా ప్రకటించారు.

దానితోపాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి పలువురు కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్‌లను కూలగొట్టాలని డిమాండ్ చేశారు. ఈ సవాల్‌కి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. నా ఫామ్ హౌస్ నిబంధలకు వ్యతిరేకంగా వుంటే కూలగొట్టుకోవచ్చని స్పష్టంగా చెప్పారు. కేటీఆర్‌దిగా భావిస్తున్న ఫామ్‌హౌస్‌ని కూల్చేయాలని పలువుని నుంచి డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సదరు ఫామ్ హౌస్ ఓనర్‌గా చెబుతున్న ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూల గొట్టవద్దు అని చెప్పలేదు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని చెప్పింది. కాబట్టి కోర్టు వైపు నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవు. అందువల్ల లైన్ మొత్తం క్లియర్‌గా వుంది.. ఇక కూలగొట్టడమే మిగిలి వుందని, ఆ కార్యక్రమం ఆదివారం నాడు పూర్తి అవబోతోందని తెలుస్తోంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment