గరుడ పురాణం చెప్పిందిదే..
నాగపంచమి పూజలతో అంతా శుభం..
నాగ పంచమి పై పురాణ గాధలెన్నో..
దేవతలకు సర్పాలతో అనుబంధం..
నాగపంచమి నాడు పూజలు ఇలా చెయ్యాలి..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/09 ఆగష్టు: నాగుల పంచమి పర్వదినం రోజు హిందువులు అత్యంత భక్తి భావంతో నాగదేవతను పూజించే శుభదినం ప్రతీ సంవత్సరం శ్రావణ శుద్ధ పంచమి నాడు వస్తుంది. దీనినే గరుడ పంచమిగా కూడా జరుపుకుంటారు. ఇక ఈ సంవత్సరం ఆగస్టు 8వ తేదీ రాత్రి 9.56 నిమిషాలకు నాగ పంచమి ఘడియలు ప్రారంభమై ఆగస్టు 9వ తేదీ శుక్రవారం రాత్రి 11.59 నిమిషాల వరకు కొనసాగుతుంది.
నేడే నాగపంచమి..
అయితే సహజంగా హిందూ పంచాంగం ప్రకారం ఉదయం వచ్చిన తిధినే ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి నాగ పంచమిని నేడు అందరూ జరుపుకోనున్నారు. నాగ పంచమి సందర్భంగా ముఖ్యంగా ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో సందడిగా మారాయి. ఈ సంవత్సరం పవిత్రమైన శ్రావణ శుక్రవారం రోజు నాగుల పంచమి రావడం కూడా విశేషయోగంగా చెబుతారు. ఇదే తొలి శ్రావణ శుక్రవారం కూడా కావటం విశేషం.
నాగ పంచమి పై పురాణ గాధలెన్నో..
మన దేశ సంస్కృతిలో నాగ దేవతకు పూజలు చేసే విధానం అనాదిగా ఆచారంలో ఉంది. నిత్యం పూజించే నారాయణుడి శేష శయనుడి పర్వమే ఈ నాగ పంచమి అని చెప్తారు. శివుడి మెడలో అలంకారమైన నాగ దేవతను ఈ రోజు హిందువులు పూజిస్తారు. నాగ దేవతతో పాటు శివుడిని ఆరాధించడం వలన ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు పోయి శుభాలు జరుగుతాయని నముతారు.
గరుడ పురాణం చెప్పిందిదే..
మహాభారతం, గరుడ పురాణం, నారద పురాణం, రామాయణం, స్కంద పురాణం, వంటి వివిధ పౌరాణిక గాధలలో సర్పాలతో మనకున్న సంబంధంపై అనేక కథలను వివరించాయి. నాగ పంచమి రోజున పాములను పూజించడం వలన భక్తులకు మంచి అదృష్టం మరియు శ్రేయస్సు కలుగుతుందని గరుడ పురాణం పేర్కొంది.
దేవతలకు సర్పాలతో అనుబంధం..
శివుడి మెడలోనే నాగ దేవత ఉండటంతో పాటు, కృష్ణుడికి కూడా సర్పాలతో సంబంధం ఉన్న అనేక కథల ద్వారా హిందువులకు తెలుసు. శ్రీకృష్ణుడిని చంపడానికి కాంస కాళియా అనే సర్పాన్ని పంపినట్లు హిందూ పురాణాలు చెబుతున్నాయి. కృష్ణుడు ఆ సర్పాన్ని ఓడించడమే కాకుండా దాని పడగపై నిలబడి వేణువు వాయించాడు. ఇది కూడా మన దేవతలకు సర్పాలతో ఉన్న సంబంధాన్ని చెప్తుంది.
నాగ పంచమి నాడు పూజలు ఇలా చెయ్యాలి..
కాగా నాగ పంచమి రోజున నాగదేవత కటాక్షం కోసం ముందుగా ఇల్లు శుభ్రం చేసుకుని, తలంటు స్నానం చేసి పూజలు నిర్వహిస్తారు. దగ్గరలో ఉన్న పుట్ట వద్దకు వెళ్లి పసుపు, కుంకుమ, గంధంతో పూజాధికాలు నిర్వహిస్తారు. దీపం వెలిగించి, అగరవత్తులు వెలిగించి నాగదేవతను మనసులో స్మరించుకుని భక్తిగా నమస్కరిస్తారు. కొందరు నాగ దేవత పుట్ట వద్ద నైవేద్యంగా పాలు పోస్తారు. నువ్వులను నైవేద్యంగా సమర్పిస్తారు. ఉపవాస దీక్ష చేస్తారు.
నాగపంచమి పూజలతో అంతా శుభం..
కొందరు తమ సన్నిహితులకు ఈ రోజు భోజనం పెడతారు. సర్పాలను పూజించిన వారికి ఎలాంటి కష్టాలు రావని చెప్తారు. నాగ దేవతను పూజించినవారికి ఎలాంటి సమస్యలు తొలగిపోతాయని, జీవితంలో సంతోషం, శ్రేయస్సు వస్తుందని నమ్ముతారు. భక్తులు. అందుకే నాగ పంచమి రోజున ప్రముఖ ఆలయాలకు వెళ్లి నాగదేవత పూజలు చేస్తారు. అత్యంత భక్తి భావంతో, ఉపవాస దీక్షతో నాగదేవతను భక్తులు పూజిస్తారు.