అవకతవకలపై చర్యలు: టెస్కాబ్ ఎండీ బి.గోపి
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఆగస్టు 7: పంట రుణమాఫీ పథకం అమలు సమయంలో 30వేల రైతుల ఖాతాల్లో సమస్యలు గుర్తించామని టెస్కాబ్ (తెలంగాణ స్టేట్ కో- అపరేటివ్ అపెక్స్ బ్యాంకు) ఎండీ డాక్టర్ బి.గోపి తెలిపారు.లోన్ అకౌంట్ మనుగడలో లేకపోవడం, ఆధార్ మ్యాపింగ్ కాకపోవటం, బ్యాంకు ఖాతా- ఆధార్ వివరాలకు పోలిక లేకపోవటం లాంటి సమస్యలున్నాయని వివరించారు. ఈ మేరకు రైతుల నుంచి ఫిర్యాదులు కూడా వచ్చాయని బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తొలి విడతలో రూ. 900 కోట్లు, రెండో విడతలో రూ. 678 కోట్లు టెస్కాబ్కు రుణమాఫీ వచ్చిందని తెలిపారు. 9 డీసీసీబీలు, 376 శాఖలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అర్హుల జాబితాలు ప్రదర్శించినట్లు చెప్పారు. సంబంధిత డీసీసీబీల నుంచి ఆధార్ జాబితాను తీసుకొని సవరణ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 157 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో 3,982 ఖాతాలకు సంబంధించిన పంట రుణాలు మాఫీకాకపోవటానికి బాధ్యులైన కార్యదర్శులపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.