హ్యూమన్ రైట్స్ టుడే/ఇంటర్నెట్ డెస్క్: వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. సరిహద్దుల్లో భారీ విన్యాసాలకు భారత వాయుసేన (IAF) సిద్ధమైంది. తూర్పు సెక్టర్‌లోని అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో ఫైటర్‌జెట్లు, హెలికాప్టర్లు, డ్రోన్లతో భారీ స్థాయిలో విన్యాసాలు చేపట్టనుంది. లద్దాఖ్ (Ladakh) సరిహద్దుల్లో యుద్ధ సన్నద్ధతను చైనా (China) అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping) పరిశీలించిన వేళ.. ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్‌లో ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు ‘ప్రళయ్’ పేరుతో ‘కమాండ్ స్థాయి’ విన్యాసాలు చేపట్టేందుకు భారత వాయుసేన (IAF) సిద్ధమవుతుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. హసిమారా, తేజ్‌పుర్, చబువా వంటి ఎయిర్‌బేస్‌ల నుంచి ఈ విన్యాసాలు జరగనున్నాయి. రఫేల్, సుఖోయ్-30ఎంకేఐ లాంటి ఫైటర్ జెట్లు, చినూక్, అపాచీ హెలికాప్టర్లు, సీ-130జే సూపర్ హెర్క్యూల్స్ ఎయిర్‌క్రాఫ్ట్, డ్రోన్లు వంటివి ఈ విన్యాసాల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
తూర్పు సెక్టార్‌లో ఇటీవల కాలంలో చేపడుతున్న రెండో భారీ విన్యాసాలు ఇవి. గతేడాది డిసెంబరు 15-16 తేదీల్లో తూర్పు సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ వెంట వాయుసేన పనితీరును పరిశీలించేందుకు ఈస్ట్రన్ కమాండ్ రెండు రోజుల పాటు యుద్ధ విన్యాసాలు చేపట్టింది. డిసెంబరు 9వ తేదీన అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగిన రోజుల వ్యవధిలోనే ఈ విన్యాసాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ ఘర్షణతో యుద్ధ విన్యాసాలకు ఎలాంటి సంబంధం లేదని అప్పుడు వాయుసేన ప్రకటించింది.
ఇదిలా ఉండగా.. లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ)తో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ.. ‘యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?’అని ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. పీఎల్‌ఏ ప్రధాన కార్యాలయం నుంచి ఆర్మీ జవాన్లతో మాట్లాడిన జిన్‌పింగ్.. యుద్ధ సన్నద్ధత, సరిహద్దుల్లో పరిస్థితుల గురించి ఆరా తీసినట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది.