విద్యాసంస్థల్లో విష సంస్కృతి

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/03 ఆగష్టు: కోటి ఆశలతో ఉన్నత విద్యాసంస్థల్లో చేరిన వారికి ర్యాగింగ్ పేరిట భయంకర అనుభవం ఎదురవుతోంది. ఇది విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసి, చదువులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇలాంటి విష సంస్కృతికి అడ్డుకట్ట పడాల్సిందే!
మనదేశంలో 1990 దశకంలో పెద్ద సంఖ్యలో ప్రైవేట్ ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు రావడంతో ర్యాగింగ్ సంస్కృతి పెరిగింది. ఉన్నత విద్యా సంస్థలను వేధిస్తున్న జటిల సమస్యగా మారింది. విద్యా సంస్థల్లో సీనియర్ విద్యార్థులు జూనియర్లపై జులుం సాగించడానికి దీన్నొక సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. ర్యాగింగ్ నిరోధానికి సరైన నిఘా లేకపోవడం, విద్యార్థుల మధ్య ప్రాంతం, భాష, సంస్కృతి, కులం, మతం, ఆర్థిక స్థితిగతులు వంటి అంతరాలు ఏర్పడటం వల్ల ఇది తీవ్రస్థాయిలో సాగుతోంది. సీనియర్లు గతంలో ర్యాగింగ్ బారిన పడటం, విద్యా సంస్థల్లో ఇదొక సర్వ సాధారణ అంశంగా భావించడం, కాలేజీ యాజమాన్యాలు, హాస్టల్ వార్డెన్ల ఉదాసీన వైఖరి వంటి కారణాలతో ఈ సంస్కృతి అంతకంతకు విజృంభిస్తోంది.

మానసిక ఒత్తిడి:

ర్యాగింగ్ కారణంగా విద్యార్థుల్లో ఆందోళన, భయం, నిరాశ వంటివి పెరగడంతో పాటు మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. లక్ష్యంపై దృష్టిసారించలేక, చదువులపై ఏకాగ్రత కోల్పోయి పరీక్షల్లో వెనకంజ వేస్తున్నారు. మానసిక ఒత్తిడి తీవ్రమై కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దేశంలో దాదాపు 60 శాతం విద్యార్థులు ర్యాగింగ్ బారిన పడుతున్నారని 2015లో జేఎన్ యూ చేపట్టిన అధ్యయనంలో తేలింది. 2017లో నిర్వహించిన మరో సర్వేలో 40 శాతం విద్యార్థులు ఏదో ఒక రకమైన ర్యాగింగ్ బారిన పడినవారేనని వెల్లడైంది. ఇందులో ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థులే ఎక్కువ. యూజీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ర్యాగింగ్ హెల్ప్ లైన్లో 2021-22 విద్యా సంవత్సరంలో 582 కేసులు, 2022-23లో 858 కేసులు, 2023-24 లో 1240 ఫిర్యాదులు అందాయి. ఇవి యూజీసీ వెల్లడించిన అధికారిక గణాంకాలు మాత్రమే. పోలీస్ స్టేషన్లలో నమో దయ్యే ర్యాగింగ్ కేసులు అదనం. 2018 జనవరి నుంచి 2023 జులై వరకు దేశంలో ర్యాగింగ్ కారణంగా 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు యూజీసీ తెలిపింది. ఇదే సమయంలో 119 మంది వైద్య విద్యార్థులు వివిధ కారణాలతో ఆత్మ హత్య చేసుకున్నారని నేషనల్ మెడికల్ కౌన్సిల్ వెల్లడించింది. అయితే, అందులో ఎంతమంది ర్యాగింగ్ కారణంగా తనువుచాలించారో స్పష్టత ఇవ్వలేదు. మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్, పంజాబ్, తదితర రాష్ట్రాల్లో ర్యాగింగ్ కారణంగా అత్యధిక మరణాలు నమోదయ్యాయి. గతేడాది వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ వేధింపులు తాళలేక జూనియర్ విద్యార్థి అసువులు బాసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.
సమగ్ర అవగాహన :
విద్యార్థుల్లో సామాజిక విలువలు, నైతికత, సత్ప్రవర్తన, సోదరభావం, సహనం, సహకారం పెంపొందించేలా మానవ విలువలను బోధించాలి. విద్యార్థులు, తల్లి దండ్రులు, అధ్యాపకులకు ర్యాగింగ్ పై మరింతగా అవగాహన పెంచాలి. బాధితుల్లో ధైర్యం నింపేలా కౌన్సెలింగ్ అందించే ఏర్పాట్లు ఆయా ప్రాంగణాల్లోనే ఉండాలి. దీనికోసం ప్రతి ఉన్నత విద్యాసంస్థ మానసిక నిపుణులను నియమించుకోవాలి. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలు, తనిఖీ బృందాలను ఏర్పాటుచేయాలి. యాజమాన్యాలకు అందే ఫిర్యాదులపై సత్వర విచారణ జరిపి దోషులకు కఠిన శిక్ష విధించాలి. ర్యాగింగ్ అరికట్టడానికి ఆయా విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకొన్న నియమాలు, విధి విధానాలు, యూజీసీ మార్గదర్శకాలు, చట్టాలపై విద్యార్థులకు మొదట్లోనే సమగ్ర అవగాహన కల్పించాలి. ఎఫ్ఎస్ఐఆర్ నమోదు, కోర్టులు విధించే జరిమానాలు, శిక్షలు వంటి అంశాలపై జాగృతపరచాలి. పదేపదే ర్యాగింగ్కు పాల్పడే విద్యార్థుల పై తీవ్రతను బట్టి పరీక్షలకు అనుమతి నిరాకరించడం, అడ్మిషన్ల రద్దు వంటి చర్యలను పరిశీలించాలి. ఇలా అన్ని రకాల పద్ధతుల్లో అందరి కృషి తోనే ర్యాగింగ్ భూతానికి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది.
రచన:
దూపాటి హరిప్రసాద్ (సామాజిక విశ్లేషకులు)

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment