ఐటీ రిటర్నుల దాఖలులో సరికొత్త రికార్డు

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/దిల్లీ/03 ఆగష్టు: ఐటీ రిటర్నుల దాఖలులో సరికొత్త రికార్డు నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రిటర్నుల దాఖలుకు చివరి రోజైన జులై 31 నాటికి మొత్తం 7.28 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికమని పేర్కొంది. గతేడాది 6.77 కోట్లతో పోలిస్తే ఈసారి దాదాపు 50 లక్షల రిటర్నులు అధికంగా దాఖలైనట్లు ఐటీ శాఖ పేర్కొంది.
2024-25 మదింపు సంవత్సరంలో వచ్చిన 7.28 కోట్ల రిటర్నుల్లో 5.27 కోట్ల రిటర్నులు కొత్త పన్ను విధానంలోనే దాఖలైనట్లు ఐటీ శాఖ తెలిపింది. పాత పన్ను విధానంలో కేవలం 2.01 కోట్ల రిటర్నులు ఫైల్‌ అయ్యాయని పేర్కొంది. రిటర్నుల దాఖలుకు చివరిరోజైన జులై 31న ఒక్కరోజే 69.92 లక్షల మంది దాఖలు చేసినట్లు తెలిపింది. మొత్తం రిటర్నుల్లో 58.57 లక్షల మంది తొలిసారి రిటర్నులు ఫైల్‌ చేశారని వెల్లడించింది. పన్ను పరిధి పెరిగిందనడానికి ఇదే సంకేతంగా నిలుస్తోంది.
పన్ను రిటర్నుల దాఖలును సులభతరం చేస్తూ కొత్త పన్ను విధానాన్ని కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎలాంటి మినహాయింపులూ చూపించుకోవడానికి వీల్లేని ఈ పన్ను విధానాన్ని యే ఏటి కా యేడు మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నారు. తాజా బడ్జెట్‌లోనూ స్టాండర్డ్‌ డిడక్షన్‌ను రూ.50 వేల నుంచి రూ.75వేలకు పెంచారు. అలాగే, ట్యాక్స్‌ స్లాబులను సవరించారు. దీంతో కొత్త పన్ను విధానం వైపు మొగ్గు చూపే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రిటర్నుల ఫైలింగ్‌లోనూ ఇది స్పష్టమవుతోంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment