హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్: సికింద్రాబాద్ రామ్‌గోపాల్‌పేటలోని దక్కన్ మాల్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈనెల 23న అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ, ఫైర్ సేఫ్టీ, రెవెన్యూ ఇతర అధికారులతో పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ సమావేశం కానున్నారు. నగరంలో వాణిజ్య భవనాల నిర్మాణ అనుమతులు, ఫైర్ అనుమతులు ఇతర అంశాలపై చర్చించనున్నట్టు అర్వింద్ కుమార్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
అక్రమ కట్టడాలపై అఖిలపక్ష సమావేశం: మంత్రి తలసాని
అక్రమ నిర్మాణాలపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనం వంటివి నగరంలో సుమారు 25వేల వరకు ఉండొచ్చని వెల్లడించారు. అయితే, అక్రమ కట్టడాలను రాత్రి రాత్రికి తొలగించలేమని.. వాటిని ఏం చేయాలనే విషయంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వ విభాగాలన్నీ వెంటనే స్పందించాయని, భవనంలో కెమికల్స్ ఉన్నందున మంటలు త్వరగా అదుపులోకి రాలేదని తెలిపారు. భవనం నాణ్యతపై వరంగల్ నిట్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి టూరిస్టులా వచ్చి మాట్లాడుతున్నారని విమర్శించారు. డబ్బుల కోసం అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరిస్తున్నారన్న కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యమన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఒక్క భవనాన్ని కూడా క్రమబద్ధీకరించలేదని, భారాసపై హైకోర్టు స్టే ఉందన్న విషయం కిషన్‌రెడ్డికి తెలీదా? అని ప్రశ్నించారు.