హ్యూమన్ రైట్స్ టుడే/దిల్లీ: వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగాల కోసం నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) పరీక్ష మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనిని మల్టీ-టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామ్ (ఎమ్‌టీఎస్)- 2022 పరీక్షలో అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ పరీక్ష కేవలం హిందీ, ఆంగ్లంలో నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ‘‘భాష కారణంగా ఎవరూ అవకాశాలు కోల్పోవద్దన్న ప్రధాని మోదీ ఆకాంక్ష మేరకు హిందీ, ఆంగ్లంతో పాటు ఉర్దూ, తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కొంకణి, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ భాషల్లోనూ ఎస్‌ఎస్‌సీ పరీక్షలు నిర్వహించనున్నాం. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో ఉన్న మిగతా భాషలనూ పరీక్షలో క్రమంగా చేర్చుతాం’’ అని ఆయన అన్నారు.