అరుదైన రామచిలుక పిల్లలు..
షాద్‌నగర్‌లో 10 రామచిలుక పిల్లలను కొన్న వ్యక్తులు..
బైక్‌పై హైదరాబాద్ తరలిస్తుండగా ఆరాంఘర్ వద్ద పట్టుకున్న అటవీ సిబ్బంది..
నెహ్రూ జూపార్క్‌కు అప్పగించిన అధికారులు..
అరుదైన అలెగ్జాండ్రిన్ రకం రామచిలుక పిల్లలను అక్రమంగా తరలిస్తుండగా అటవీశాఖ సిబ్బంది పట్టుకున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు రంగారెడ్ది జిల్లా షాద్‌నగర్‌లో 10 రామచిలుక పిల్లలను కొని బైక్‌పై హైదరాబాద్ తరలిస్తుండగా ఆరాంఘర్ వద్ద అహనుద్దీన్, సయ్యద్ బుర్హానుద్దీన్ నుంచి అటవీశాఖ యాంటీ పోచింగ్ స్కాడ్ బృందం బుధవారం పట్టుకున్నది. చూడచక్కగా ఉండి, ముచ్చటగొలిపేలా ఉన్న వాటిని రూ.25 వేలకు అమ్మేందుకు తరలిస్తున్నట్టు నిందితులు విచారణలో తెలిపారు. వైల్డ్ లైఫ్ చట్టం-1972 ప్రకారం ఈ రకమైన రామచిలుకలను వేటాడటం, వెంట ఉంచుకోవడం నేరమని, చట్టప్రకారం మూడేళ్ల జైలుశిక్ష, రూ.ఐదు లక్షల జరిమానా విధించవచ్చని పీసీసీఎఫ్ ఆర్‌ఎం డోబ్రియల్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న చిలుక పిల్లలను నెహ్రూ జూపార్క్‌కు తరలించి సంరక్షించాలని ఆదేశించారు. హైదరాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, యాంటీ పోచింగ్ స్కాడ్ సిబ్బంది, శంషాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఇతర సిబ్బందిని పీసీసీఎఫ్ డోబ్రియల్ అభినందించారు.