హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చ్ 25: తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో రాజకీయ పార్టీని స్థాపించింది మొదలు ఇప్పటివరకూ ప్రతి లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తూనే ఉన్నారు.
కానీ మొట్టమొదటిసారి ఈ సంప్రదాయానికి బ్రేక్ పడింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆ కుటుంబం నుంచి ఒక్కరూ పోటీ చేయడం లేదు. పార్టీని పెట్టిన తర్వాత ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో లీడర్లు, కేడర్‌లో నిరాశ నెలకొన్నది. పోటీ చేయడానికి సిట్టింగ్ ఎంపీలు కూడా సిద్ధపడటం లేదు. ఇలాంటి సమయంలో ధైర్యం కల్పించేందుకు ఆ కుటుంబం నుంచి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలూ పార్టీ లీడర్ల నుంచి వ్యక్తమయ్యాయి. కానీ పరిస్థితుల కారణంగా పోటీకి దూరంగానే ఉండిపోయారు.
*లీడర్లు, కేడర్ నుంచి ప్రతిపాదనలొచ్చినా..*
టీఆర్ఎస్ పేరుతో పార్టీని స్థాపించిన తర్వాత 2004 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కేసీఆర్ పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసి ప్రాతినిథ్యం వహించారు. ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి, లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి రెండుచోట్లా గెలిచారు. మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేసి గజ్వేల్ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి బాధ్యతలు చూసుకున్నారు. అదే ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ స్థానం నుంచి పోటీ చేసి పూర్తి ఐదేండ్లు ఎంపీగా కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేసినా ఓడిపోయారు. మెదక్ నుంచి కేసీఆర్, కవిత, హరీశ్‌రావు పోటీ చేస్తారన్న వార్తలతో పాటు పోటీ చేయాలని పార్టీ లీడర్ల నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చాయి. కానీ అవి వర్కవుట్ కాలేదు. నిజామాబాద్ స్థానం నుంచి కవితకు అవకాశం లభిస్తుందన్న వార్తలూ వెలువడ్డాయి. కానీ అది కూడా బెడిసికొట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టు కావడంతో అవకాశం చేజారిపోయింది. ఆ స్థానంలో బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేసేలా కేసీఆర్ ఆయన పేరును ఖరారు చేశారు. ఇక మల్కాజిగిరి నుంచి కేటీఆర్ పోటీ చేస్తారని వార్తలు వచ్చినా అక్కడ లక్ష్మారెడ్డికి చాన్స్ లభించింది.
*పార్లమెంటుకు దూరంగా కేసీఆర్ ఫ్యామిలీ..!*
ఇంకోవైపు ఇంతకాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేసీఆర్ సమీప బంధువు జోగినపల్లి సంతోష్ పదవీకాలం కూడా వచ్చే నెల 2న ముగిసిపోతున్నది. దీంతో పార్లమెంటు ఉభయ సభల్లో కేసీఆర్ ఫ్యామిలీ, బంధువులుగా ఒక్కరూ కూడా లేకపోవడం తొలిసారి. పార్టీ సంక్షోభంలో, కష్టకాలంలో ఉన్నప్పుడు మోరల్‌గా నిలబడాల్సిన పరిస్థితుల్లో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావు, సంతోష్‌రావు తదితరులంతా పార్లమెంటుకు దూరంగా ఉండిపోవడం పార్టీలోనే చర్చనీయాంశమైంది. గెలిచినా, ఓడిపోయినా లోక్‌సభ ఎన్నికల బరిలో ఉండటం పార్టీ లీడర్లకు నైతికంగా మద్దతు ఇచ్చినట్లయ్యేది. కానీ అసలు పోటీ నుంచే తప్పుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.