కేసీఆర్… కర్మఫలం!
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చ్ 17:
పదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ‘తెలంగాణ బాపు’గా కొంతకాలం పాటు పిలిపించుకున్న మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ కుమార్తె కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ విధంగా అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకుపోతారని ఆనాడు ఎవరైనా ఊహించారా?
కవిత అరెస్టు న్యాయమా? అన్యాయమా? అన్న విషయం పక్కన పెడితే ఈ దుస్థితికి ఆమె స్వయంకృతాపరాధమే కారణం. పదేళ్లపాటు తండ్రి కేసీఆర్ ఏకఛత్రాధిపత్యంగా పాలించిన తెలంగాణ రాష్ట్రంలో సంపాదించుకోవడానికి అవకాశాలే లేనట్టుగా, సంపాదించుకున్నది చాలదు అన్నట్టుగా ఆమె ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలోకి కూడా చొరబడ్డారు. ఫలితమే ఈ అరెస్ట్. కవిత అరెస్టు అన్యాయం, అక్రమం, అప్రజాస్వామికం అని కేటీఆర్, హరీశ్‌రావు వంటి వారు గగ్గోలు పెట్టడం గురివింద సామెతను గుర్తుకుతెస్తున్నది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో అరెస్టు చేసి జైలుకు పంపలేదా? ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికల సందర్భంగా గతంలో అనేక సందర్భాలలో శాసనసభ్యులకు, ఇతరులకు డబ్బు ముట్టజెప్పడం జరిగింది. అంతేకాదు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన పలువురు శాసనసభ్యులకు భారీ మొత్తాల్లో డబ్బు ఆశ చూపి బీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం నిజం కాదా? అయినా రేవంత్ రెడ్డి మాత్రమే కనీవినీ ఎరుగని నేరానికి పాల్పడినట్టుగా ప్రచారం చేసి కొన్ని నెలల పాటు జైలులో నిర్బంధించారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఈ కేసుతో ముడిపెట్టారు. ఈడీ అధికారులు ఉద్దేశ పూర్వకంగానే కవితకు న్యాయస్థానాలలో ఉపశమనం లభించకుండా శుక్రవారం నాడు అరెస్టు చేశారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు గానీ తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో మరచిపోతే ఎలా? ఒక్కగానొక్క కూతురు పెళ్లి ఘనంగా నిర్వహించుకొనే అవకాశం రేవంత్ రెడ్డికి ఇవ్వలేదే? ఎనిమిది గంటలకు మించి పెరోల్‌పై బయట ఉండకూడదని కోర్టులో బలంగా వాదించలేదా? అందుకే కర్మ మనల్ని వదలదని అంటారు. ఒకప్పుడు తెలంగాణ నా అడ్డా అని గర్జించిన కేసీఆర్ కుటుంబాన్ని ఇప్పుడు తెలంగాణలోనే కష్టాలు వెంటాడుతున్నాయి. అదేమిటోగానీ ప్రత్యేక రాష్ర్టాల కోసం ఉద్యమించి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పలువురు నాయకులు కేసుల్లో ఇరుక్కున్నారు. జార్ఖండ్ రాష్ట్రం కోసం పోరాడిన శిబూ సోరెన్ జైలుకు కూడా వెళ్లారు. నిన్నటి వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. జేఎంఎం ముడుపుల కేసులో నాటి ప్రధాని పీవీ నరసింహారావు కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి వంతు వచ్చింది. కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ర్టాలను సొంత జాగీర్లు చేసుకొని పాడి ఆవులుగా మార్చుకొనే ప్రయత్నం చేయడమే ఈ అనర్థాలకు కారణం కాదా? ఆశకు అంతు ఉండాలి. డబ్బు సంపాదనకు అలవాటు పడిన రాజకీయ నాయకులు, అధికారులను.. సమాజం కూడా ఒక స్థాయి వరకే మన్నిస్తుంది. అత్యాశకు పోయినప్పుడే ఇలాంటి తిప్పలు వస్తాయి. ఇప్పుడు కవిత విషయంలో కూడా జరుగుతున్నది ఇదే. 2014 నుంచి నిన్న మొన్నటి వరకు అధికారంలో కొనసాగిన కల్వకుంట్ల కుటుంబం అడుగడుగునా అధికార దర్పం ప్రదర్శించింది. డబ్బు సంపాదనకు అలవాటు పడింది. తొలి ఐదేళ్లు పెద్దగా ఆరోపణలు లేకుండా పనిచేసిన కేసీఆర్ కూడా రెండవ పర్యాయం రెవెన్యూ తదితర విషయాలలో అడ్డగోలుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే కవిత రాష్ట్ర సరిహద్దులు దాటి ఢిల్లీ వరకు వెళ్లారు. లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఈ కేసులో అరెస్టు కావడమే అవమానం అనుకుంటే ఒక మహిళ అయి ఉండీ లిక్కర్ వ్యాపారంలో వేలుపెట్టడం వల్ల కవితకు సానుభూతి కూడా దక్కక పోవచ్చు. కవిత అరెస్టు సందర్భంగా అక్కడి పరిస్థితులను గమనిస్తే కేసీఆర్ కుటుంబం ఒంటరి అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇది జరుగుతున్న సమయంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడానికి మంతనాలు జరిపారు. కర్మ ఫలాన్ని అనుభవించి తీరాల్సిందే అంటే ఇదే. అగ్రనేతలలో కేటీఆర్, హరీశ్‌రావు మాత్రమే కవిత ఇంటికి వెళ్లారు. తాను ఇప్పటికీ అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నారేమో తెలియదు గానీ ఈడీ అధికారులతో కేటీఆర్ అభ్యంతరకరంగా వ్యవహరించారు. సహనం నశించిన ఒక మహిళా అధికారి ‘ఇతడిని కూడా అరెస్టు చేయండి’ అనడాన్ని మనం విన్నాం. రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా కేసీఆర్‌కు ఇప్పుడు సంఘీభావం ప్రకటించే వారు కనిపించడం లేదు. తాము శాశ్వతంగా అధికారంలోనే ఉంటామని విర్రవీగే నాయకులకు, వారి కుటుంబ సభ్యులకు కవిత ఉదంతం ఒక హెచ్చరిక. మొత్తమ్మీద తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహర్జాతకుడనే చెప్పాలి. ఈ అరెస్టు ఏదో శాసనసభ ఎన్నికలకు ముందు జరిగి ఉంటే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లభించి ఉండేది కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉండేవారు కారు. కవిత అరెస్టును కేసీఆర్ అండ్ కో ఎంతవరకు ఉపయోగించుకొని ఉండేవారో తెలియదు గానీ బీఆర్‌ఎస్‌తో తమకు అవగాహన లేదని చెప్పుకొనే మహదావకాశం భారతీయ జనతా పార్టీకి దక్కేది. ఈ రెండు పార్టీల మధ్య లాలూచీ ఉందన్న అభిప్రాయాన్ని తొలగించగలిగి ఉంటే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించి ఉండేది. అలా జరగలేదు కనుకే కాంగ్రెస్ లాభపడగలిగింది. అదను చూసి దెబ్బ కొట్టాలని అంటారు. కవితను అరెస్టు చేయడం కూడా ఇప్పుడు బీజేపీకి మేలు చేయకపోవచ్చునన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పుడు ఈ అరెస్టు కేసీఆర్ అండ్ కోకు ఉపయోగపడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి కేసీఆర్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఫాంహౌజ్‌లో జారిపడి తుంటి విరగ్గొట్టుకున్నారు. మరోవైపు పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడటం మొదలెట్టారు. దీంతో సరిగ్గా ఊపిరి తీసుకోలేని పరిస్థితికి కేసీఆర్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు కవితను అరెస్టు చేయడం కేసీఆర్‌కు కొత్త ఊపిరి పోసినట్టే. నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో జరుగుతున్న సమయంలోనే కవిత అరెస్టు జరగడం కాకతాళీయం కాకపోవచ్చు. బీఆర్‌ఎస్‌తో తమకు ఎటువంటి అవగాహనా లేదని తెలంగాణ సమాజానికి స్పష్టమైన సంకేతం ఇవ్వడం కోసమే కేంద్ర పెద్దలు ఈ సమయాన్ని ఎంచుకున్నారని చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ కూడా వెలువడింది. లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే క్రమంలో తొలి మెట్టుగా కవిత అరెస్టు జరిగిందన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే కేజ్రీవాల్‌కు బెయిల్ లభించింది. ఇండియా కూటమిలో కేజ్రీవాల్ కీలకంగా ఉన్న విషయం విదితమే.
*ఎదుర్కోగల మొనగాడేడీ?*
మరోవైపు ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బయట పెట్టాల్సి రావడం కూడా కేంద్ర పెద్దలకు చికాకు కలిగిస్తోంది. అనేక కేసులలో విచారణ ఎదుర్కొంటున్న లాటరీ కింగ్ మార్టిన్ కూడా భారీ మొత్తంలో ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేయడం, మరికొన్ని కంపెనీలు తమ వార్షిక లాభాలను మించి బాండ్లు కొనడం, సీబీఐ, ఈడీ దాడుల తర్వాత మరికొన్ని కంపెనీలు బాండ్లు కొనడం వంటి అంశాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. జాతీయ స్థాయిలో ఈ అంశం చర్చనీయాంశం అయింది. నిజానికి ఈ బాండ్ల వ్యవహారం లోక్‌సభ ఎన్నికలకు ముందు బయటపడటం కేంద్ర పెద్దలను ఆత్మరక్షణలో పడేయాలి. అయితే ఒకప్పుడు బోఫోర్స్ తరహాలో ప్రతిపక్షాలు అన్నీ ఏకమై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టగల పరిస్థితి ఇప్పుడు లేదు. రాష్ర్టాలలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో పాటు మరికొన్ని రాష్ర్టాలలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా ప్రధాని మోదీని ధిక్కరించే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలహీనపడింది. ప్రజలు కూడా ఎలక్టోరల్ బాండ్స్ వంటి అంశాలకు పెద్దగా ప్రాధాన్యం ఇస్తారని భావించలేం. బోఫోర్స్ వ్యవహారానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో ప్రజలు కూడా స్వరం కలిపారు. జాతి జాగృతమై నాటి ప్రధాని రాజీవ్ గాంధీని ఓడించింది. ఇప్పుడు ఉత్తరాది ప్రజలు జైశ్రీరాం స్మరణతో తన్మయత్వం చెందుతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సొంత రాష్ర్టానికే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలను కూడగట్టే నాయకుడే లేకుండా పోయారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఒక్కరే ఇంకా కేంద్రానికి వ్యతిరేకంగా గొంతెత్తుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా ప్రకటించి, పార్టీ పేరును కూడా భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్న కేసీఆర్ కూడా సొంత రాష్ట్రంలోనే ఓడిపోయారు. ప్రజలు అత్యాశకు పోయి తనను ఓడించారని, తనను గెలిపించి ఉంటే జాతీయ స్థాయిలో అగ్గి పెట్టి ఉండేవాడినని కేసీఆర్ తాజాగా కరీంనగర్‌లో చెప్పుకొన్నారు గానీ ఆయనకు అంత సీన్ లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం కేసీఆర్ అనేక మార్గాల్లో ప్రయత్నించారు. అయితే శాసనసభ ఎన్నికల ముందు జరిగిన తప్పు రిపీట్ కాకూడదన్న ఉద్దేశంతో బీజేపీ పెద్దలు పొత్తు ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ క్రమంలోనే అదను కాకపోయినా కవిత అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడినందున ఇప్పుడు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోరు రసవత్తరంగా మారబోతోంది. లోక్‌సభకు పోటీ చేయగల అభ్యర్థులు సొంత పార్టీలో లేకపోవడంతో ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ కూడా భారత రాష్ట్ర సమితికి చెందిన నాయకులను ఎగరేసుకుపోతున్నాయి. నిన్నటి వరకు కాంగ్రెస్-బీజేపీని ఖాళీ చేశానని సంబరపడిన కేసీఆర్.. ఇప్పుడు సొంత పార్టీ ఖాళీ అవుతున్నప్పటికీ గుడ్లప్పగించి చూడాల్సిన పరిస్థితి. వంద రోజుల క్రితం బీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కిటకిటలాడింది. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలు కూడా కేసీఆర్‌కు బై బై చెబుతూ కాంగ్రెస్-బీజేపీ తరఫున పోటీ చేయబోతున్నారు. రాజకీయ పార్టీలకు ఈ పరిణామం ఒక గుణపాఠంగా ఉంటుంది. ప్రజా విశ్వాసం కోల్పోయినప్పుడు మంద బలం ఎంతగా ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఓటమి తప్పదని శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు రుజువు చేశారు. చతురంగ బలాలు ఉన్నప్పటికీ ఓటమి నుంచి కేసీఆర్ తప్పించుకోలేకపోయారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తరఫున గెలిచిన శాసనసభ్యులలో పలువురు మహా నాయకులేమీ కాదు. ప్రజా ఆకాంక్షలను, మనోభావాలను గుర్తించకుండా అధికారాన్ని చలాయిస్తే కేసీఆర్ కుటుంబానికి ప్రస్తుతం ఎదురవుతున్న చేదు అనుభవాలే కాచుకొని ఉంటాయి. శాసనసభలో ప్రతిపక్షాలకు మిగిలిన కొద్దిమంది సభ్యులు కూడా గొంతు ఎత్తలేని పరిస్థితిని కల్పించిన కేసీఆర్ విజయగర్వంతో విర్రవీగారు. కేసీఆర్ తరహాలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా శాసనసభలో సంఖ్యాపరంగా పార్టీ బలం పెంచుకొనే పనిలో నిమగ్నమయ్యారు. లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే నాటికి పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. అయితే ఈ చేరికలు ప్రభుత్వ సుస్థిరతకు మాత్రమే ఉపయోగపడతాయి. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేవు.
*అరెస్టుతో ఎవరికి లాభం?*
తాజా సమాచారం ప్రకారం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పుంజుకుంటోంది. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి ఆందోళన కలిగించే అంశమే. శాసనసభ ఎన్నికల సందర్భంగా బీజేపీ అతి విశ్వాసంతో ఉండటంతో పాటు వ్యూహాత్మక తప్పిదాలు కూడా చేసింది. ఫలితంగా కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు కవిత అరెస్టు ప్రభావం ప్రజలపై కనిపించకపోతే మాత్రం లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు. అయితే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారిలో కొంత మంది మాత్రం లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలన్న ఆలోచన చేస్తున్నారట. దీనికితోడు ప్రధాని మోదీ ప్రభావం ఉండనే ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒకవైపు, ప్రజా బలాన్ని పెంచుకుంటున్న బీజేపీ మరోవైపూ మోహరించి ఉన్నందున కేసీఆర్ పార్టీ పరిస్థితి ఏమిటి? అనే సందేహం సహజంగానే కలుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని, ప్రజలంతా తమ పాలనను గుర్తుచేసుకుంటున్నారని భ్రమ పడుతున్న కేసీఆర్ ఆత్మవంచన చేసుకుంటున్నారు. గాలిలో మేడలు కట్టకూడదు. కేటీఆర్ వ్యాఖ్యలు, వ్యవహార శైలిని గమనిస్తున్న వారు కూడా ఆయనలో అహంభావం ఛాయలు ఇంకా తొలగిపోలేదని భావిస్తున్నారు. కవిత అరెస్టు నేపథ్యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు చలోక్తులు విసురుతున్నారు. గురివెంద సామెతను గుర్తుచేస్తున్నారు. చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు హైదరాబాద్‌లో ధర్నాలు చేసిన వారిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ కవితను ఢిల్లీకి తీసుకుపోయారు కనుక అక్కడ ధర్నాలు చేసుకోండని ఎగతాళి చేస్తున్నారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ రాజకీయాలను కలుషితం చేయడంతో పాటు అవినీతి మయం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. ఆయన పుణ్యమా అని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు అధికారం లేకుండా, డబ్బు లేకుండా ఉండలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని అంటారు. అధికారంలో ఉన్నప్పుడు కన్నూ మిన్నూ కానకుండా వ్యవహరించిన ఫలితాన్ని కేసీఆర్ అండ్ కో ఇప్పుడు అనుభవిస్తున్నారు. కవితను అరెస్టు చేసి ఢిల్లీ తీసుకుపోయినా తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకు రాలేదు. పార్టీ పేరు మార్చుకోవడం ద్వారా తెలంగాణతో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా కేసీఆర్ తెంచుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించిన వారిని తెలంగాణ ద్రోహులుగా చిత్రించి తెలంగాణ వాదాన్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు సొంత బిడ్డను అరెస్టు చేసి తీసుకు వెళ్లిన ఈడీ అధికారులను తెలంగాణ ద్రోహులని నిందించగలరా? ఈడీ అధికారులు తమ వెంట ఢిల్లీకి తీసుకుపోతున్నప్పుడు కవిత భావోద్వేగం చెందినప్పటికీ తెలంగాణ సమాజం చడీ చప్పుడూ ఎందుకు లేకుండా పోయిందో కేసీఆర్ కుటుంబం ఆత్మపరిశీలన చేసుకోవాలి. తెలంగాణ అంటే కల్వకుంట్ల కుటుంబం కాదని గ్రహించాలి. ఉద్యమ సమయంలో తమ ఆకాంక్షను నెరవేర్చగలిగే నాయకుడ్ని కేసీఆర్‌లో చూశారు. అధికారంలోకి వచ్చాక ఆయనలోని నియంతను, ఫ్యూడల్‌నూ చూశారు. కుటుంబ సభ్యుల దర్పాన్ని, అధికార దుర్వినియోగాన్ని గమనించారు. ఫలితంగా కేసీఆర్ ఇప్పుడు ఒంటరి వారయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవిత అరెస్టును ఆపడానికి ప్రయత్నించి ఉండకపోతే అధికారం కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురయ్యేది కాదన్న అభిప్రాయం కూడా ఉంది. ఇప్పుడు అటు అధికారం కోల్పోయారు, ఇటు కుమార్తె అరెస్టును నిలువరించలేకపోయారు. తోటకూర కాడలు దొంగిలించిన నాడే మందలించి ఉంటే.. అన్నట్టుగా కుటుంబ సభ్యులను ప్రారంభంలోనే కట్టడి చేసి ఉంటే కేసీఆర్‌కు ప్రస్తుత దుస్థితి దాపురించి ఉండేది కాదు. తెలంగాణ సమాజాన్ని తాను మాత్రమే కాచి వడపోశానని చెప్పుకొనే కేసీఆర్, తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం అత్యంత ప్రధానం అన్న వాస్తవం ఎందుకు గ్రహించలేకపోయారో? ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. తనలోని అహాన్ని విడనాడి ఆత్మపరిశీలన చేసుకుంటూ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించగలిగితే ప్రజలు మళ్లీ ఆయనను ఆదరించే అవకాశం లేకపోలేదు. ఫ్లోటింగ్ నాయకులను చూసి మురుసుకొనే వారికి కేసీఆర్ ఒక ఉదాహరణగా నిలుస్తారు. స్టెరాయిడ్స్ వాడితే తాత్కాలికంగా ఉత్తేజం వస్తుంది. ఫ్లోటింగ్ నాయకులు కూడా అదే విధంగా పనికొస్తారు. ప్రజలతో మమేకం అవుతూ సంస్థాపరంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెడితే ఎన్ని ఒడిదుడుకులనైనా ఎదుర్కోవచ్చు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇందుకు ఉదాహరణ. కేసీఆర్ కూడా ఒకప్పుడు చంద్రబాబు అనుచరుడే కనుక ఆయనను చూసి నేర్చుకొనే ప్రయత్నం చేస్తే ఈ దుస్థితి నుంచి బయటపడవచ్చు. పడి లేచిన వాడే అసలైన రాజకీయ గండరగండడుగా గుర్తింపు పొందుతాడు. టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలతో చీమలు పెట్టిన పుట్టలో పాములా దూరి కబళించినంత మాత్రాన రాజకీయ గండరగండడు కాలేరు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తారన్న విషయం పక్కన పెడితే ఓట్ల పరంగానైనా ద్వితీయ స్థానంలో నిలబడగలిగితే కేసీఆర్ నిలదొక్కుకొనే అవకాశం ఉంటుంది.
*ప్చ్.. అమెరికాలోనూ కొరతేనా?*
ఈ విషయం అలా ఉంచితే బలమైన యువ నాయకుల కొరత వర్ధమాన దేశాలనే కాదు- ప్రపంచానికే పెద్దన్నగా చలామణి అవుతూ వచ్చిన అమెరికాకు కూడా తప్పడం లేదు. ఇప్పుడు ఆ దేశంలో కూడా కొత్త తరం నాయకులు రావడం లేదు. ఫలితంగా రాబోయే ఎన్నికల్లో కూడా రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీల తరఫున డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్‌లే మళ్లీ అధ్యక్ష పీఠం కోసం తలపడబోతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వయసు 81 సంవత్సరాలు. ట్రంప్ వయసు 77 సంవత్సరాలు. మాజీ అధ్యక్షుడైన ట్రంప్ పై అనేక ఆరోపణలు రావడం, కోర్టుల్లో విచారణ జరగడం, జరిమానా విధించడం జరిగింది. అరెస్టు కూడా అయ్యారు. అయినా రిపబ్లికన్ పార్టీకి ఆయన అభ్యర్థిత్వమే దిక్కయింది. అంటే ట్రంప్ వంటి వ్యక్తితో పోటీపడగల నాయకుడే రిపబ్లికన్ పార్టీలో లేరన్న మాట. శారీరకంగా అనేక రుగ్మతలు ఎదుర్కొంటున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను మించిన నాయకుడు డెమోక్రటిక్ పార్టీలో లేకుండా పోవడం ఏమిటి? దీన్నిబట్టి అమెరికా వంటి అగ్రరాజ్యం కూడా నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్న మాట. చెట్టులేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అని అమెరికన్లు కూడా సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అన్న మాట!