దేశంలోనే పెద్ద మురికినీటి శుద్ది కేంద్రం తిరుపతిలో ఏర్పాటు : ఎమ్మెల్యే భూమన
మురికినీరును శుద్ది చేసి వినియోగంలో తెస్తాం – మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ
ఆంధ్ర ప్రదేశ్/తిరుపతి జిల్లా/ హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ ప్రతినిధి:-
తిరుపతి వినాయకసాగర్ ప్రక్కన 5 ఎం.ఎల్.డి మురికినీటి శుద్ది కేంద్రాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణలు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ తిరుపతి నగరంలోని ఒక వైపు నుండి డ్రైనేజి నీరు ఇంతకు మునుపు వినాయకసాగర్లోకి చేరడం జరిగేదని, ఇప్పుడు మురికినీటి శుద్ది కేంద్రం వినియోగంలోకి రావడం వలన రోజుకి 50లక్షల లీటర్ల మురికి నీటిని వివిద దశల్లో శుద్దిపరిచి పూర్తి స్థాయిలో మంచినీటిగా మార్చి వినాయకసాగర్ కు తరలించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా వినాయకసాగర్ నిండిన తరువాత మిగిలు నీటిని వ్యవసాయానికి మల్లించడం జరుగుతున్నదన్నారు. దేశంలోనే అతి పెద్ద 5 ఎం.ఎల్.డి సమర్థం కలిగిన మురికినీటి శుద్ది కేంద్రాన్ని తిరుపతిలో నిర్మించడం అభినందనీయమన్నారు. నగరంలో వెలువడే మురికినీటిలోనే ఇంతకు మునుపు వినాయక నిమజ్జనం జరిగేదని, ఇకపై శుద్ది చేసిన నీటిలోనే నిమజ్జనం జరుగుతుందన్నారు. తిరుపతి నగరపాలకసంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ స్మార్ట్ సిటి నిధులతో సుమారు 14 కోట్ల ఖర్చుతో రోజుకి 50 లక్షల లీటర్ల మురికినీటిని శుద్ది చేసి మంచినీటిగా మార్చడం జరుగుతుందన్నారు. భూగర్భ జలాలు చాల వరకు కలుషితం కాకుండ కాపాడడంలో ఈ ప్లాంట్ ఎంతో ఉపయోగ పడుతుందని మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు. ప్లాంట్ గురించి ఎస్.ఈ మోహన్, కాంట్రాక్టర్ భానుదయ్య రెడ్డిలు వివరిస్తూ ప్లాంట్ లోకి వచ్చిన మురికి నీటిని ఏఏ దశల్లో శుద్ది చేయడం జరుగుతుందనే విషయాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటి సభ్యులు ఎస్.కె.బాబు, కార్పొరేటర్లు ఆదం రాధాకృష్ణా రెడ్డి, అనీల్ కుమార్, రామస్వామి వెంకటేశ్వర్లు, హనుమంత నాయక్, నారాయణ, ఆంజినేయులు, తిరుపతి మునిరామిరెడ్డి, యస్.ఈ. మోహన్, డి.ఈ. విజయకుమార్ రెడ్డి, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.