మహిళా సమానత్వం కోసం పోరాడిన ఆమె..

Get real time updates directly on you device, subscribe now.

ఆమె ఆలోచనల ప్రతిరూపమే మహిళా దినోత్సవం
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్:
ఆమెకు వచ్చిన ఓ ఆలోచన వేలాది అడుగులకు బాటగా మారింది. వేలాది మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది. ఆమే క్లారా జెట్కిన్‌. జర్మన్‌ మార్క్సిస్ట్‌ సిద్ధాంతకర్త, కమ్యూనిస్ట్‌ కార్యకర్త, మహిళల హక్కుల కోసం పోరాడిన ధీర. ఇలా ఆమె గురించి చెప్పుకుంటూ పోతే మహిళా హక్కుల కోసం ఆమె చేసిన కృషి అంతా ఇంతా కాదు. శతాబ్ద కాలానికి ముందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిర్భావానికి ఆమె ఆలోచనలే నాంది పలికాయి. మహిళ కోసం ఓ రోజు ఉండాలని.. ఆమె చేసిన ప్రతిపాదనకు వేలాదిమంది మహిళలు ఏకగ్రీవంగా ఆమోదించారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ రంగాల్లో ఎదగటానికి ఆమెకు వచ్చిన ఆ ఆలోచనలే బీజం వేశాయి. మహిళలు కూడా తమ హక్కుల కోసం పోరాడగలిగే ధైర్యాన్ని, తెగింపును, పోరాటపటిమను రాజేశాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ ధీర వనిత పరిచయం నేటి మానవిలో…

జర్మనీలోని వైడెరౌలో 1857లో జన్మించిన క్లారా జోసెఫిన్‌ ఐస్నర్‌ తన కుటుంబంలో పెద్ద కూతురు. వైడెరౌ వ్యవసాయ ఆధార గ్రామం. ఆమె తండ్రి గాట్‌ఫ్రైడ్‌ ఈస్నర్‌ పాఠశాల ఉపాధ్యాయుడు. అలాగే చర్చి కూడా నడిపేవారు. ఆమె తల్లి జోసెఫిన్‌ విటాలే, మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చారు. ఉన్నత విద్యావంతురాలు. 1872లో వీరి కుటుంబం లీప్‌జిగ్‌కు వెళ్లింది. క్లారా లీప్‌జిగ్‌ టీచర్స్‌ కాలేజీ ఫర్‌ ఉమెన్‌లో చదువుకున్నారు. అక్కడే ఆమె సోజియాల్డెమోక్రాటిస్చే పార్టీ డ్యూచ్‌లాండ్స్‌ (సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ)తో పరిచయాలను ఏర్పరచుకున్నారు.

నిషేధం విధించడంతో…
1878లో జర్మనీలో సోషలిస్ట్‌ కార్యకలాపాలపై నిషేధం విధించడంతో క్లారా 1882లో జ్యూరిచ్‌కు వెళ్లి పారిస్‌లో ప్రవాసంలో గడిపారు. అక్కడ ఆమె జర్నలిస్ట్‌, ట్రాన్స్‌లేషన్‌ కోర్సులు చేశారు. పారిస్‌లో ఉన్న సమయంలో ఆమె సోషలిస్ట్‌ ఇంటర్నేషనల్‌ గ్రూప్‌ స్థాపనలో ముఖ్య పాత్ర పోషించారు. రష్యన్‌ అయిన ఒస్సిప్‌ జెట్కిన్‌ను ఆమె ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. అప్పటికే ఆయన అంకితభావంతో పని చేసే మార్క్సిస్ట్‌. వీరికి మాగ్జిమ్‌, కాన్స్టాంటిన్‌ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒసిప్‌ జెట్కిన్‌ 1889 ప్రారంభంలో తీవ్ర అనారోగ్యానికి గురై అదే ఏడాది జూన్‌లో మరణించాడు. భర్త మరణించిన తర్వాత క్లారా తన పిల్లలతో కలిసి స్టుట్‌గార్ట్‌కు వెళ్లిపోయారు. ఒస్సిప్‌ జెట్‌కిన్‌తో పరిచయం తర్వాతనే క్లారా నిజమైన రాజకీయ జీవితం ప్రారంభమైంది. సోషలిస్ట్‌ సమావేశాల్లో పాల్గొన్న కొద్ది నెలల్లోనే ఆమె పార్టీకి పూర్తిగా కట్టుబడి, మహిళా విముక్తి కోసం మార్క్సిస్ట్‌ విధానాన్ని అనుసరించారు. టీచర్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసిన క్లారా 1874 నుండి జర్మనీలో మహిళా, కార్మిక ఉద్యమంతో సంబంధాలను పెంచుకున్నారు. 1878లో ఆమె సోషలిస్ట్‌ వర్కర్స్‌ పార్టీలో చేరారు.

పూర్తి సామాజిక పరివర్తనతోనే
1889లో రెండవ ఇంటర్నేషనల్‌కు చేసిన ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ ‘సామాజిక సమానత్వాన్ని కాంక్షించే శ్రామిక మహిళలు, మహిళల హక్కుల కోసం పోరాడుతున్న బూర్జువా మహిళా ఉద్యమం నుండి తమ విముక్తి కోసం ఏమీ ఆశించరు. ఆ భవనం ఇసుకపై నిర్మించబడింది, దానికి అసలు ఆధారం లేదు. శ్రామిక మహిళలు స్త్రీ విముక్తిని కోరుకుంటున్నారు. ఇది సామాజిక ప్రశ్నలో ఒక భాగమని వారు పూర్తిగా నమ్ముతున్నారు. ఈ సమకాలీన సమాజంలో ఈ ప్రశ్న ఎప్పటికీ పరిష్కరించబడదు. పూర్తి సామాజిక పరివర్తన తర్వాత మాత్రమే దీనికి పరిష్కారం దొరుకుతుంది. అంటే సోషలిజం ద్వారా మాత్రమే స్త్రీ విముక్తిని సాధ్యం’ అన్నారు.

ప్రవాస జీవితం
1898లో క్లారాకు తనకంటే చాలా చిన్నదైన రోసా లక్సెంబర్గ్‌తో స్నేహం ఏర్పడింది. వారి స్నేహం 20 ఏండ్ల పాటు కొనసాగింది. రోసా మహిళా ఉద్యమం పట్ల ఉదాసీనతతో ఉన్నప్పటికీ, క్లారా శక్తులను చాలా వరకు గ్రహించింది. తర్వాత కాలంలో ఇద్దరూ మంచి రాజకీయ మిత్రులుగా మారారు. 1880లో అప్పటి జర్మనీ అధినేత ఒట్టోవాన్‌ బీస్మార్క్‌ సోషలిస్ట్‌ వ్యతిరేక చట్టాలను తీసురావడంతో దాన్ని వ్యతిరేకిస్తూ జర్నలిస్టుగా ఉన్న క్లారా నిషేధిత సాహిత్యాన్ని ముద్రించారు. దాంతో ఆమెపై నిషేధం విధించారు. క్లారా కొంతకాలం స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌లో ప్రవాస జీవితం గడిపారు. జర్మనీకి తిరిగి వచ్చిన పదేండ్ల తర్వాత ఆమె సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ జర్మనీ మహిళల వార్తాపత్రిక డై గ్లీచ్‌హీట్‌ (ఈక్వాలిటీ)కి సంపాదకురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. సుమారు 25 ఏండ్లు పత్రిక బాధ్యతలు చూసుకున్నారు.

మహిళల హక్కుల కోసం పోరాడండి
సోషలిజం ద్వారానే మహిళలకు సమాన అవకాశాలు, ఓటు హక్కు వస్తుందని క్లారా బలంగా నమ్మారు. అందుకే జర్మనీలో మహిళా ఉద్యమాన్ని అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించారు. 1907లో ఆమె ఎస్‌పీడీలో కొత్తగా స్థాపించబడిన ‘ఉమెన్స్‌ ఆఫీస్‌’కి నాయకురాలయ్యారు. ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవం(ఐడబ్ల్యూడి)లో కూడా ముఖ్యపాత్ర పోషించారు. ఆగష్టు 1910లో డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో సోషలిస్ట్‌ సెకండ్‌ ఇంటర్నేషనల్‌ సాధారణ సమావేశానికి ముందు అంతర్జాతీయ మహిళా సదస్సు నిర్వహించారు. అమెరికన్‌ సోషలిస్టుల ద్వారా ప్రేరణ పొంది జెట్‌కిన్‌, కేట్‌ డంకర్‌తో పాటు మరికొందరితో కలిసి ‘ప్రత్యేక మహిళా దినోత్సవం’ను ఏటా నిర్వహించాలని ఆమె ప్రతిపాదించారు. అయితే ఆ సమావేశంలో తేదీని నిర్ణయించలేదు. తర్వాత 1911లో జరిగిన సమావేశాల్లో అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని ప్రతీ ఫిబ్రవరి 28వ తేదీన జరుపుకోవాలని నిర్ణయించారు.

మొదటి ప్రపంచ యుద్ధానికి వ్యతిరేకంగా
మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో స్విట్జర్లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా శాంతి సదస్సులో క్లారా మాట్లాడుతూ ‘ఈ యుద్ధం వల్ల ఎవరికి లాభం? ప్రతి దేశంలో రైఫిల్స్‌, ఫిరంగుల తయారీదారులు, ఆర్మర్‌-ప్లేట్‌, టార్పెడో బోట్‌లు, షిప్‌యార్డ్‌ యజమానులు, సాయుధ దళాల అవసరాలను సరఫరా చేసేవారు. వారి లాభాల ప్రయోజనాల కోసం వారు ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచి యుద్ధాన్ని సృష్టిస్తున్నారు. ఈ యుద్ధం వల్ల కార్మికులకు ఏమీ లాభం లేదు. పైగా చాలా నష్టపోతున్నారు’ అన్నారు. యుద్ధ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల క్లారా అనేకసార్లు జైలుకు వెళ్ళారు.

కమ్యూనిస్టు పార్టీలో చేరిక
1916లో ఏర్పడిన స్పార్టసిస్ట్‌ లీగ్‌, ఇండిపెండెంట్‌ సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ జర్మనీ సహ-వ్యవస్థాపకులలో క్లారా ఒకరు. అయితే దీని యుద్ధ అనుకూల వైఖరికి నిరసనగా 1917లో ఆ పార్టీ నుండి విడిపోయారు. జనవరి 1919లో జర్మనీ కమ్యూనిస్ట్‌ పార్టీ స్థాపించబడింది. క్లారా కూడా అందులో చేరారు. రీచ్‌స్టాగ్‌లో 1920 నుండి 1933 వరకు పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. ఆమె, పాల్‌ లెవీ ఈ ఇద్దరూ రీచ్‌స్టాగ్‌లోకి ప్రవేశించిన మొదటి కమ్యూనిస్టులు.

అంతర్జాతీయ నాయకురాలిగా…
1924 వరకు క్లారా కేపీడీ కేంద్ర కార్యాలయంలో సభ్యురాలిగా ఉన్నారు. 1927 నుండి 1929 వరకు ఆమె పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలిగా పని చేశారు. ఆమె 1921 నుండి 1933 వరకు కమ్యూనిస్ట్‌ ఇంటర్నేషనల్‌ (కామింటర్న్‌) కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు కూడా ఉన్నారు. మహిళల కోసం ఒక అంతర్జాతీయ సెక్రటేరియట్‌కు అధ్యక్షత వహించారు. ఇది అక్టోబర్‌ 1920లో కమ్యూనిస్ట్‌ ఇంటర్నేషనల్‌ చేత ఏర్పాటు చేయబడింది. జూన్‌ 1921లో దీని రెండవ అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఆమె అధ్యక్షతన మాస్కోలో జరిగిన కమ్యూనిస్ట్‌ మహిళల సంఘం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8కి మార్చింది. 1925లో ఆమె జర్మన్‌ వామపక్ష సంఘీభావ సంస్థ రోట్‌ హిల్ఫ్‌ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

తీవ్ర అనారోగ్యంలోనూ…
క్లారా కేవలం మహిళా ఉద్యమ నాయకురాలు మాత్రమే కాదు. 1949 కాలంలో తూర్పు జర్మనీలో ఎంతో ప్రసిద్ధి చెందిన కథకురాలు. ప్రస్తుతం ప్రతి ప్రధాన నగరంలో ఆమె పేరు మీద ఒక వీధి ఉంది. రష్యాలోని తులాలో ఆమె పేరుతో ఒక వీధి కూడా ఉంది. ఇది రెడ్‌ ఆర్మీ ప్రాస్పెక్ట్‌కు సమాంతరంగా నడుస్తుంది. ఇది ఆ నగరంలోని మాస్కో రైలు స్టేషన్‌కు వెళ్లే ప్రధాన మార్గం. ఆగష్టు 1932లో ఆమె మాస్కోలో ఉండగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయినా కొత్తగా ఎన్నుకోబడిన రీచ్‌స్టాగ్‌ ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించడానికి ఆమె బెర్లిన్‌ వెళ్లారు. ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటంలో కార్మికులు ఏకం కావాలని ఆమె తన ప్రారంభ ఉపన్యాసంలో పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలం పాటు మహిళా సమానత్వం కోసం పోరాడిన ఆమె 1933లో మాస్కో సమీపంలోని అర్ఖంగెల్స్‌స్కోరులో తన 76 ఏండ్ల వయసులో మరణించారు. యూరప్‌ నలుమూలల నుండి ప్రముఖ కమ్యూనిస్టులు ఆమె అంతిమ యాత్రకు హాజరయ్యారు.

సోషలిజమే ఏకైక మార్గం
క్లారా దృష్టిలో స్త్రీలపై అణచివేతను నిజంగా అంతం చేయడానికి సోషలిజమే ఏకైక మార్గం. మహిళలను ఇంటి నుండి బయటకు తీసుకురావడంతో పాటు పనిలోకి తీసుకురావడం ఆమె ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి. తద్వారా వారు తమ పరిస్థితులను మెరుగు పరచుకోవడానికి ట్రేడ్‌ యూనియన్‌లు, ఇతర కార్మిక హక్కుల సంస్థల్లో పాల్గొనగలుగుతారు. స్త్రీ అణచివేతను నిరోధించే సంస్కరణలను సాధించేందుకు సోషలిస్టు ఉద్యమం పోరాడాలని ఆమె వాదించారు. దాని కోసమే ఆమె 1920లో ‘ది ఉమెన్స్‌ క్వశ్చన్‌’పై వ్లాదిమిర్‌ లెనిన్‌ను ఇంటర్వ్యూ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment