ఆంధ్ర ప్రదేశ్/తిరుపతి జిల్లా/ హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ ప్రతినిధి:-
చంద్రగిరి, న్యూస్:-
చంద్రగిరి మండలం మల్లయ్య పల్లి దోర్ణకంబాల మడపం పల్లి గ్రామాలలో సంక్రాంతి పండుగలో నాలుగవ రోజైన ముక్కనుమ సందర్భంగా మంగళవారం ఉత్సాహంగా జల్లికట్టు నిర్వహించారు. ఈ సందర్భంగా పశువుల జోరుకు యువకులు బేజారు పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు గ్రామాలలో పర్యటించి జల్లికట్టు నిర్వహించకూడదని పలుసార్లు హెచ్చరికలు జారీ చేసి, పోస్టర్లతో ప్రచారం చేసినప్పటికీ గ్రామాలలో లెక్క చేయక జల్లికట్టు నిర్వహణకు పూనుకున్నారు. చదురుమదురు సంఘటనలు తప్ప ప్రశాంతంగా జల్లికట్టు నిర్వహించారు.వందలాది ఎద్దులు, ఆవులు ఈ జల్లికట్టులో పాల్గొన్నాయి. పోలీసుల ఆంక్షలు ఎన్ని ఉన్నప్పటికీ జల్లికట్టు ఎడ్ల పందాలు జరిపితే కఠినంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆదేశించినప్పటికీ ఈ నిబంధనలన్నీ బేఖాతరు చేసి యధావిధిగా ప్రతి ఏడాది లాగానే గ్రామాలలో జల్లికట్టు నిర్వహించారు. ముందుగానే తయారు చేసుకున్న చెక్క పలకలను నడివీధి గంగమ్మ వద్ద ఉంచి పూజలు చేసి దొడ్లకు తీసుకుని వెళ్లారు. పశువుల కాపరులు చురుకుగా పరిగెత్తగలిగే వాటికి కొత్త బట్టలతోపాటు చక్కపలకలను తమ అభిమాన నాయకుల చిత్రపటాలను కట్టారు. దొడ్ల నుంచి వదులుకుంటూ డప్పుల చప్పులతో బెదిరించారు పశువులను నిలువరించి వాటికి కట్టిన చక్క పలకలను వసూలు చేసుకోవడానికి యువకులు ఉత్సాహవంతంగా ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. కొన్ని ఎద్దులు పరుగులు తీస్తూ అడ్డదిడ్డంగా జనాలపైకి వెళ్లడంతో గాయాలయ్యాయి. స్థానికంగానే ప్రథమ చికిత్స నిర్వహించి పంపారు. జల్లికట్టులో స్థానిక యువకులు ఉత్సాహంగా పాల్గొని అనేక ఎద్దులను కట్టడి చేసి వాటి కొమ్ములకు కట్టిన పలకలను చేజిక్కించుకున్నారు. గ్రామాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.